ఎగ్గొట్టినోడికే అప్పు..

share on facebook

– నిండా మునిగిన ఓరియంటల్‌ బ్యాంక్‌
– పంజాబ్‌ సీఎం అల్లుడిపై సీబీఐ కేసు నమోదు
పంజాబ్‌, ఫిబ్రవరి26(జ‌నంసాక్షి) : దేశాన్ని కుదిపేస్తున్న నీరవ్‌మోడీ మోసం మరువకముందే మన బ్యాంకులు చేస్తున్న తప్పులు మరోసారి బయటపడ్డాయి. ఒక అవసరం కోసం తీసుకున్న అప్పును ఇతర పనులకు మళ్లించి బ్యాంకుకు చెల్లించకుండా ఎగ్గొట్టిన వారికే మళ్లీ అప్పును మంజూరు చేశాయి. దీంతో సదరు ఎగవేతదారుడు ఆ రుణాన్ని కూడా ఎగ్గొట్టాడు. దీంతో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌కు రూ.109కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. సింభోలి షుగర్స్‌ లిమిటెడ్‌ చేసిన ఈ స్కాంలోని పాత్రధారుల జాబితాలో పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ అల్లుడు గురుపాల్‌సింగ్‌ కూడా ఉన్నాడు. దీంతో
సీబీఐ నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. ఆదివారం ఈ కంపెనీ డైరక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఈ విషయాన్ని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్‌ దయాల్‌ తెలిపారు.
మోసం ఇలా.. దేశంలోని అతిపెద్ద షుగర్‌ కంపెనీల్లో పంజాబ్‌కు చెందిన సింభోలి షుగర్స్‌ లిమిటెడ్‌ కూడా ఒకటి. దీనికి గుర్మిత్‌ సింగ్‌ మాన్‌ ఛైర్మన్‌. 2011లో ఈ కంపెనీ చెరకు రైతులకు ఫైనాన్స్‌ చేసేందుకు ఓబీసీ (ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ ) వద్ద రూ.148.60 కోట్లను రుణంగా తీసుకుంది. కానీ ఈ మొత్తాన్ని రైతులకు అందజేయకుండా ఇతర అవసరాలకు వాడుకుంది. కేవలం కొంత భాగం మాత్రమే రైతులకు అందజేసింది. ఈ రుణంలో రూ.97.85కోట్లు మొండిబకాయిగా మారింది. మార్చి 2015లో దీనిని మోసంగా బ్యాంక్‌ ప్రకటించింది. అదే ఏడాది మేలో దీనిని మొండి బకాయిల జాబితాలో చేర్చింది. ఎన్‌పీఏలను తగ్గించుకోవాలని బ్యాంక్‌ భావించింది. దీంతో పాత మొండి బకాయి రూ. 97.85 కోట్లను తీర్చేందుకు సింభోలి షుగర్స్‌కు 2015 జనవరి 28న మరో రూ.110 కోట్లను కార్పొరేట్‌ రుణంగా అందజేసింది. దీనిని పుస్తక సర్దుబాటు చేసి మొత్తం రుణం రూ.112.94 కోట్లుగా తేల్చింది. కానీ కొత్త రుణాన్ని కూడా సింభోలీ షుగర్స్‌ ఎగ్గొట్టింది. పెద్దనోట్లు రద్దు చేసిన 20రోజుల తర్వాత 2016 నవంబర్‌ 29న ఈ రుణాన్ని కూడా ఓబీసీ ఎన్‌పీఏగా ప్రకటించింది. దీనిపై ఓబీసీ గత ఏడాది నవంబర్‌ 17న సీబీఐని ఆశ్రయించింది. దీనిపై నేరపూరిత కుట్ర, మోసాల నిరోధక చట్టం కింద ఫిబ్రవరి 22న కేసు నమోదు చేసింది. ఈకేసులో కంపెనీ ఛైర్మన్‌ గుర్మిత్‌సింగ్‌ మాన్‌, డిప్యూటీ ఎండీ గురుపాల్‌ సింగ్‌(పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ అల్లుడు), కంపెనీ సీఈవో జీఎస్‌సీ రావ్‌, సీఎఫ్‌వో సంజేయ్‌ టఫారియా, ఎగ్జిక్యూటీవ్‌ గురుసిమ్రన్‌ కౌర్‌ మాన్‌, మరో ఐదుగురు నాన్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్లపై  సీబీఐ కేసు నమోదు చేసింది.
భారీగా పతనమైన ఓబీసీ షేరు
సింభోలీ స్కాం బయటపడటంతో ఓబీసీ షేర్‌ స్టాక్‌ మార్కెట్లలో భారీగా పతనమైంది. సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో 10గంటల సమయంలో షేరు విలువ 9శాతం కోల్పోయింది. మరోపక్క సింభోలీ షుగర్స్‌ షేర్‌ ఏకంగా 20శాతం విలువ కోల్పోయింది.

Other News

Comments are closed.