ఎదురెదురుగా ఇండిగో విమానాలు 

share on facebook

– త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
బెంగళూరు, జులై12(జ‌నం సాక్షి) : రెండు ఇండిగో విమానాలు త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరు వద్ద ఆకాశంలో రెండు విమానాలు చాలా దగ్గరగా వచ్చాయి. కేవలం నాలుగు మైళ్ల దూరంలో ప్రయాణించాయి. వాటి మధ్య ఎత్తులో తేడా కేవలం 200అడుగులు మాత్రమే. ఒకదానికొకటి ఆకాశంలో ఢీకొంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేంది. కానీ అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది. 6ఈ 779(కోయంబత్తూరు-హైదరాబాద్‌), 6ఈ 6505(బెంగళూరు-కొచ్చి) విమానాలు సెకన్ల వ్యవధిలో ఢీకొనే ప్రమాదాన్ని తప్పించుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం బెంగళూరు ఎయిర్‌బేస్‌లో జరిగింది. ట్రాఫిక్‌ కొలిషన్‌ అవాయిడెన్స్‌ సిస్టమ్‌(టీసీఏఎస్‌) ద్వారా హెచ్చరిక జారీ చేయడంతో రెండు విమానాల్లోని పైలట్లు వెంటనే స్పందించి ప్రమాదం జరగకుండా నివారించారు. జులై 10న కోయంబత్తూరు-హైదరాబాద్‌, బెంగళూరు-కొచ్చి మార్గాల్లో ప్రయాణిస్తున్న తమ విమానాల్లో టీసీఏఎస్‌-రిసల్యూషన్‌ అడ్వైజరీ సిస్టమ్‌ పైలట్లను హెచ్చరించినట్లు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది.

Other News

Comments are closed.