ఎన్డీ తివారీ కుమారుడి మరణంపై హత్య కేసు నమోదు

share on facebook

దిల్లీ: ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్‌ ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఊపిరాడకపోవడంతోనే మృతి చెందినట్లు వైద్య నివేదికలో వెల్లడైంది. దీంతో ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు హత్యకేసుగా నమోదు చేసి క్రైమ్‌ బ్రాంచికి అప్పగించారు.  ఫోరెన్సిక్‌, క్రైమ్‌ బ్రాంచి బృందాలు ఆయన నివాసానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నాయి. మరోవైపు రోహిత్‌ మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని, అతడిది సహజ మరణమేనని రోహిత్‌ తల్లి ఉజ్వలా తివారీ పేర్కొన్నారు.
శేఖర్‌ ఆకస్మికంగా మృతి చెందినట్లు దిల్లీ డీఎస్పీ విజయ్‌ కుమార్‌ మంగళవారం వెల్లడించారు. ముక్కు నుంచి రక్తస్రావం అవుతున్న శేఖర్‌ను అంబులెన్సులో మ్యాక్స్‌ సాకేత్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

శేఖర్‌ మృతి చెందడానికి ఒక రోజు ముందు ఉత్తరాఖండ్‌ బయల్దేరి వెళ్లారు. లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వృత్తి పరంగా న్యాయవాది అయిన శేఖర్‌.. రెండేళ్లపాటు ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌కు సలహాదారుగా కూడా ఉన్నారు. రోహిత్‌ను ఎన్డీ తివారీ తన కుమారుడిగా అంగీకరించకపోవడంతో తండ్రి మీద చాలా కాలం ఆయన పోరాటం చేశారు. డీఎన్‌ఏ నివేదికలు, న్యాయపోరాటం ఫలితంగా ఏడు సంవత్సరాల అనంతరం 2014లో తివారీ ఆయన్ను కొడుకుగా అంగీకరించక తప్పలేదు. ఆ సమయంలోనే రోహిత్‌ శేఖర్ పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

Other News

Comments are closed.