ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్‌ఎస్‌ సిద్ధం

share on facebook

– ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు దుష్పచ్రారం చేస్తే లీగల్‌గా ముందుకెళ్తాం
– కనీవినీ ఎరగని రీతిలో ప్రగతి నివేదన సభ
– ప్రజలు, తెరాస కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలి
– నిజామాబాద్‌ ఎంపీ కవిత
నిజామాబాద్‌, ఆగస్టు30(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధంగా ఉందని నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్‌ లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చేందుకు కేసీఆర్‌ అన్ని విధాల కృషి చేస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారిని ఆర్థికంగా ఆదుకొనేందుకు కృషి చేస్తున్నట్లు కవిత తెలిపారు. దీనిలో భాగంగా యాదవులకు గొర్రెల పంపిణీ, మత్స్య కారులకు చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలు వదటం, వారికి అవసరమైన పరికరాలు అందించటం, అదేవిధంగా అన్నదాతలకు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తూ వారి అన్ని రంగాల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో సాగు, తాగునీటి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని కవిత తెలిపారు. ప్రతి ఇంటికి నల్లానీరు అందించేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్‌భగీరథ పథకం ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పూర్తయిందని, వచ్చే దీపావళి నాటికి అన్ని ప్రాంతాల్లో ఇంటింటికి నల్లానీరు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణను కోటి ఎకరాల మాగానిగా మార్చేందుకు కేసీఆర్‌ ప్రత్యేక దృష్టితో ముందుకెళ్తున్నారని అన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణాలు చేస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం, సీతారామ, భక్తరామదాసు, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఇలా అనేక ప్రాజెక్టులతో కోటి ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.  నాలుగేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఒక్కో నియోజకవర్గ అభివృద్ధికి రూ.2 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, తమ అడ్రస్సు ఎక్కడ గల్లంతవుతుందోననే భయంతో ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని కవిత మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు దుష్పచ్రారం చేస్తే లీగల్‌గా ముందుకెళ్తామన్నారు. సెప్టెంబర్‌ 2వతేదీన కనీవినీ ఎరగని రీతిలో ప్రగతి నివేదన సభను నిర్వహించ తలపెట్టినట్లు తెలిపారు. ఈ సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆమె కోరారు.

Other News

Comments are closed.