ఎన్నికల సంస్కరణలపై చిత్తశుద్ది ఉందా?

share on facebook

ఆర్థిక సంస్కరణలు, ఎన్నికల సంస్కరణల గురించి పదేపదే వల్లె వేస్తున్న ప్రధాని మోడీ తాజాగా జరుగుతున్న పరిణామాలను పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేలు, ఎంపిలు ఫిరాయింపులు చేసినా పట్టించుకోవడం లేదు. అంతెందుకు బిజెపి సిద్దాంతాలకు విరుద్దంగా గుజరాత్‌లో ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో జరగిని డ్రామా అందరికీ తెలిసిందే. భారతీయ జనతా పార్టీకి చెందిన నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్న వేళ ఒక్క ఎంపీ కోసం అనైతిక చర్యలను ప్రోత్సహించారు. గుజరాత్‌లో తగిన బలం లేకపోయినా మూడవ అభ్యర్థిని రాజ్యసభకు పోటీ పెట్టి, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా అదనంగా ఒక ఎంపీ సీటు సంపాదించడానికి చేసిన ప్రయత్నాలను మనం చూశాం. ఇవన్నీ మోడీ గమనించడం లేదని అనుకోవడానికి లేదు. నాటి ప్రధాని అటల్‌కు ప్రస్తుత ప్రధాని మోడీకి మధ్య ఉన్న తేడా ఇదే. ఒడిసా ముఖ్యమంత్రిగా వెళ్లిన కాంగ్రెస్‌ ఎంపీ గిరిధర్‌ గమాంగ్‌ అప్పటికింకా లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా విశ్వాస పరీక్షలో పాల్గొని వాజ్‌పేయ్‌ ప్రభుత్వాన్ని కూల్చారు. అయితే ఒక్క ఓటు కోసం వాజ్‌పేయ్‌ పదవీత్యాగం చేశారే తప్ప ప్రభుత్వాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించలేదు. ఉన్నత సంప్రదాయాలు నెలకొల్పడంలో మాత్రం వాజ్‌పేయ్‌ తరవాతనే ఎవరైనా. విపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి అనైతిక చర్యలకు అనేకం పాల్పడింది. రాష్ట్రప్రభుత్వాలను కూల్చడం, గవర్నర్‌ పాలనను పెట్టడం పరిపాటిగా మారేది. ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు లేకున్నా మరో రకంగా మోడీ నేతృత్వంలోని కేంద్రం చర్యలకు పూనుకుంటోంది. ఈశాన్య రాష్టాల్ల్రో అధికారం కోసం అనేక అనైతిక చర్యలకు పాల్పడింది. గోవాలో అయితే మరీ పారికర్‌ను పంపి సిఎంగా చేయించింది. రాజ్యాంగంలో ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేసే ప్రతిపాదనలు లేకపోవడంతో ఇలా జరిగిపోతోంది. దేశాన్ని ‘కాంగ్రెస్‌ ముక్త భారత్‌’ చేయాలన్న పట్టుదలతో మోదీ, షా ద్వయం ఆ పార్టీని దెబ్బతీయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదలడం లేదు. కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీసే క్రమంలో చేస్తున్న పనులన్నీ దేశహితం కోసమేనని సరిపెట్టుకోవాలేమో తెలియదు. బిహార్‌లో, గుజరాత్‌లో జరిగిన పరిణామాల వల్ల ప్రధాని మోదీ నైతికత, నిబద్ధత ప్రశ్నార్థకంగా మారాయి. ప్రజలు తిరస్కరించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బిహార్‌ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యింది. అంటే ప్రజల తీర్పుతో సంబంధం లేని ప్రభుత్వం అక్కడ ఇప్పుడు పరిపాలిస్తోంది. ఇది ఎంతవరకు సమర్థనీయమో మోదీచెప్పాలి. నోట్ల రద్దు తరవాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు డబ్బు అందడం అంత ఈజీగా జరగడం లేదు. ప్రజలు ఎటింలకు వెళితే ఖాళీ డబ్బాలు కనిపిస్తున్నాయి. నిజానికి దేశంలో నల్లధనానికి, అవినీతికి చోటు ఉండకూడదన్న నినాదంతోనే పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మోదీ తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రభావం వల్ల ఇబ్బందులు ఎదురైనా తమ జీవితాలలో మార్పు వస్తుందనీ, నల్లకుబేరుల ఆట ముగిసినట్టేనని నమ్మిన సామాన్య జనం ప్రధానమంత్రికి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు అదే దారిలో జీఎస్‌టీ తీసుకువచ్చినా ప్రధానికి అండగా ఉన్నారు. కుళ్లు, కుతంత్రాలు, అవినీతిమయమైన రాజకీయాలను నరేంద్ర మోదీ ప్రక్షాళన చేయగలరన్న నమ్మకం ఉండటం వల్లనే ప్రజలు ఆయనకు జైకొడుతున్నారు. ప్రజలకు అందని నగదు రాజకీయ పార్టీలకు మాత్రం లభిస్తోంది. నిన్నగాక మొన్న ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు గుజరాత్‌లో ఎమ్మెల్యేల మద్దతు కోసం డబ్బు ఖర్చు చేశారు. ఈ డబ్బుకు లెక్క ఉందో లేదో మోదీద్వయం చెప్పాలి. నిజానికి దేశంలో నల్లధనం, అవినీతి పోవాలంటే

రాజకీయ పార్టీల నుంచే ప్రక్షాళన మొదలవ్వాలి. నల్లధనం రూపంలో రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకుని ఓటర్లను కొనుగోలు చేయడానికి వాడుతున్నాయి. ఎన్నికలు అయ్యాక తగిన మెజారిటీ సమకూరని సందర్భాలలో ఎమ్మెల్యేలు లేదా ఎంపీల బేరసారాల కోసం ఈ నల్లధనాన్నే వాడుతున్నారు. ఎన్నికల సంస్కరణల గురించి మాట్లాడుతున్న వారు దీనిపైనా మాట్లాడాలి. ఎన్నికల విరాళాలు ప్రకటితం కావాలని చెబుతున్నా పార్టీల వద్ద గుప్తధనం పోగవుతూనే ఉంది. వ్యాపారులు,పారిశ్రామికవేత్తలు రాజకీయ పార్టీలకు ఇస్తున్న విరాళాలలో అత్యధిక భాగం నల్ల డబ్బు రూపంలోనే ఉంటోంది. ఈ పరిస్థితిని నివారించకుండా ఎన్ని ఉపన్యాసాలు చేసినా ఫలితం ఉండదు. నంద్యాలలో ఇటీవల జిరగిన ఉప ఎన్నికలో కూడా ప్రధాన పార్టీలు రెండూ పోటీ పడి డబ్బు ఖర్చు చేసాయి. రెండేళ్ల పదవీకాలం కూడా లేని ఎమ్మెల్యే పదవి కోసం ఒక్కో పార్టీ వంద కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసిందని బహిరంగ విమర్శలు వచ్చాయి. ఇందులో ఒక్క రూపాయి కూడా లెక్కకు రాదు. ఎన్నికల ఖర్చు లక్షల నుంచి కోట్లకు చేరిపోయింది. ఈ లెక్కన వచ్చే ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలూ దాదాపు అయిదు వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయవలసి ఉంటుందన్న ప్రచయారం సాగుతోంది. ఇవికాక ఎంపీ ఎన్నికలు ఉండనే ఉన్నాయి. 2019 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఎంత డబ్బు ఖర్చు చేస్తుందో చూడాలి! ఎన్నికలలో డబ్బు అవసరం లేకుండా సంస్కరణలు తీసుకురాకుండా చర్యలు తీసుకున్నామని చెప్పినా నల్లధనం పోగవుతూనే ఉంటుంది. రాజకీయ పార్టీల ప్రధాన లక్ష్యం అధికారం కావడం వల్ల్‌ అందుకు వారు ఎంతకైనా తెగిస్తున్నారు. అందువల్ల సంస్కరణల్లో ఇది కూడా ప్రధానం కావాలి. డబ్బును ఖర్చు చేయకుండా అడ్డుకట్ట వేయగలగాలి.

ఇంతజరిగాక ఇప్పుడు ఎన్నికల సంస్కరణలు అంటున్నారు. ఎపి, తెలంగాణల్లో నిర్లజ్జగా ఫిరాయింపులు చోటుచేసుకున్నా పట్టించుకోవడం లేదు. ముందుగా ఫిరాయింపులకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు సాగాలి.

—————–

 

Other News

Comments are closed.