ఎమ్మెల్సీ ఫలితాలే..  లోక్‌సభలో పునరావృతమవుతాయి

share on facebook


– దేశంలో రాహుల్‌ ప్రధాని కావడం ఖాయం
– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
సూర్యాపేట, మార్చి29(జ‌నంసాక్షి) : తెలంగాణలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రానున్నాయని, టీఆర్‌ఎస్‌కు దిమ్మతిరిగేలా ప్రజలు తీర్పు ఇవ్వనున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఈనెల 1వ తేదీన హుజూర్‌నగర్‌లో జరగనున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన ఏర్పాట్లను శుక్రవారం ఉత్తమ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.. అధికార టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఎమ్మెల్యే ఎన్నికల్లో తమ తీర్పుతో పట్టభద్రులు సరైన గుణపాఠం చెప్పారని సంతోషం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇది కొనసాగుతుందని, కాంగ్రెస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ కూటమి అత్యధిక స్థానాలు సాధించి రాహుల్‌ ప్రధాని అవుతారని ఉత్తమ్‌ జోస్యం చెప్పారు. తెలంగాణలో అసెంబ్లీ ఫలితాల్లో తెరాస ఈవీఎంల ట్యాపరింగ్‌కు పాల్పడిందని తాజా ఎమ్మెల్సీ ఫలితాలను చూస్తే రుజువవుతుందని అన్నారు. ఈవీఎంల మాయతోనే కేసీఆర్‌ గెలిచారని, ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్‌ పత్రాల ద్వారా నిర్వహించడం ద్వారా వారి బలమేంటో అర్థమైందన్నారు. ప్రజల్లో కాంగ్రెస్‌ అంటే నమ్మకముందని, లోక్‌సభ ఎన్నికల్లో ఈ విషయాన్ని రుజువుచేయబోతున్నారని ఉత్తమ్‌ తెలిపారు. రాహుల్‌ ఏప్రిల్‌ 1న హుజూర్‌నగర్‌, సిద్ధిపేట, నాగర్‌కర్నూల్‌ ప్రాంతాల్లో పర్యటించనున్నారని, రాహుల్‌ సభల విజయవంతం ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్తేజాన్ని నింపుతామన్నారు. అదేవిధంగా ఏప్రిల్‌1నే కాకుండా ఏప్రిల్‌ 9తేదీ లోపు మరోమారు రాష్ట్రంలో రాహుల్‌ పర్యట ఉంటుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పదికిపైగా స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కేసీఆర్‌ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ఉత్తమ్‌ హెచ్చరించారు.

Other News

Comments are closed.