ఎల్‌ఆర్‌ఎస్‌ సవరణ జీవో జారీ..

share on facebook

– 131 నంబరు జీవోను సవరించిన రాష్ట్ర ప్రభుత్వం

– రిజిస్ట్రేషన్‌ నాటి మార్కెట్‌ విలువ ఆధారంగా రుసుం వసూలు చేయాలని నిర్ణయం

– ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తుల వెలువ..

హైదరాబాద్‌,సెప్టెంబరు 17(జనంసాక్షి): ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి క్రమబద్ధీకరణ రుసుం నిర్ణయిస్తూ ఇటీవల జారీ చేసిన 131 నంబరు జీవోను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. రిజిస్ట్రేషన్‌ నాటి మార్కెట్‌ విలువ ఆధారంగా ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్‌ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీతోపాటు చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌, సభ్యులు జగ్గారెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, వివేకానంద తదితరులు ఎల్‌ఆర్‌ఎస్‌ అంశంపై చర్చించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ అభినందనీయమే అయినా జీవో నం.131 ప్రకారం చెల్లించాల్సిన రుసుంతో పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతోందన్నారు. ప్లాటు కొన్నప్పటి రిజిస్ట్రేషన్‌ ధర ప్రకారం రుసుం నిర్ణయిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌ జీవో నం.131 సవరిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. స్థలం రిజిస్ట్రేషన్‌ సమయంలో ఉన్నప్పటి ధరల మేరకే క్రమబద్ధీకరణ ఛార్జీ ఉంటుందని స్పష్టం చేశారు. దీని వల్ల ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌) దరఖాస్తుదారులకు సుమారు యాభై శాతం వరకు భారం తగ్గుతుందని పేర్కొన్నారు. రుసుం చెల్లింపు గడువు వచ్చే మార్చి వరకు ఉండటంతో పేద, మధ్య తరగతి ప్రజలపై పెద్దగా భారం పడబోదన్నారు. ”ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం 2015లో జారీ చేసిన జీవోనే ఈసారీ యథాతథంగా అమల్లోకి తెస్తాం. అలాగే గతంలో ఇళ్లు, స్థలాల క్రమబద్ధీకరణ కోసం జారీ చేసిన 58, 59 జీవోల ప్రకారం దాఖలైన అపరిష్కృత దరఖాస్తుల గురించి మరోసారి పరిశీలిస్తాం. నోటరీ ద్వారా జరిగిన ఆస్తుల లావాదేవీలకు సంబంధించిన అంశాన్ని కూడా సవిూక్షిస్తాం” అని మంత్రి వివరించారు. కేటీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఎల్‌ఆర్‌ఎస్‌ సవరణ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీగా దరఖాస్తులు

హైదరాబాద్‌: తెలంగాణలో స్థలాల క్రమబద్దీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌)కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు 1,81,847 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీటిలో మున్సిపాలిటీల నుంచి 74,998, గ్రామ పంచాయతీల పరిధిలో 63,338, మున్సిపల్‌ కార్పొరేషన్ల నుంచి 43, 511 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు ఫీజు కింద ప్రభుత్వ ఖజానాకు రూ.18.50కోట్లు చేరినట్లు వెల్లడించారు.ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి క్రమబద్ధీకరణ రుసుం నిర్ణయిస్తూ ఇటీవల జారీ చేసిన 131 నంబరు జీవోను రాష్ట్ర ప్రభుత్వం సవరించిన విషయం తెలిసిందే. రిజిస్ట్రేషన్‌ నాటి మార్కెట్‌ విలువ ఆధారంగా ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Other News

Comments are closed.