ఏకగ్రీవాలపై దృష్టిపెట్టండి 

share on facebook

– ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10లక్షల వస్తాయి
– అవి ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేల నిధుల నుంచే ఇస్తాం
– టీఆర్‌ఎస్‌ పార్టీకి కార్యకర్తలే ప్రాణవాయువు
– కేసీఆర్‌ పరిపాలనా దక్షితను దేశం మొత్తం గుర్తిస్తోంది
– ‘రైతుబంధు’ను దేశవ్యాప్త అమలుకు ప్రధాని దృష్టిపెట్టారు
– తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
సిరిసిల్ల,జనవరి3(జ‌నంసాక్షి): త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ భాగం ఏకగ్రీవం అయ్యేలా తెరాస నేతలు, కార్యకర్తలు దృష్టిసారించాలని, తద్వారా పోటీ లేకుండా చూసుకోవాలని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ సూచించారు. గురువారం సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు.. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు రూ. 10 లక్షలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు నా ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.15లక్షలు ఇస్తానని కేటీఆర్‌ ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ లేకుండా చూసుకోవాలన్నారు. లక్ష్మీపూర్‌ తండా స్ఫూర్తితో సిరిసిల్ల నియోజకవర్గంలో ఎక్కువ గ్రామాలు ఏకగ్రీవం కావాలన్నారు. ఇది ఎన్నికల నామ సంవత్సరమని, త్వరలో
పంచాయతీ, పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నాయని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి కార్యకర్తలే ప్రాణవాయువు అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 71శాతం ఓట్లు టీఆర్‌ఎస్‌ కే పడ్డాయని, పంచాయతీ ఎన్నికల్లో అవకాశం రాని వారికి సొసైటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారని, తెలంగాణ ప్రజలంతా సీఎం కేసీఆర్‌ వైపే ఉన్నారని అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైందని కేటీఆర్‌ అన్నారు. ముందస్తు ఎన్నికలకు పోయి గెలిచిన ఘనత సీఎం కేసీఆర్‌ ది అని తెలిపారు. రాహుల్‌ గాంధీ, చంద్రబాబు ఎంత దుష్పచ్రారం
చేసినా ప్రజలు నమ్మలేదని, ప్రధాని మోదీ, అమిత్‌ షా, ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్రమంత్రులు ప్రచారం చేసినా ప్రజలు బీజేపీని తిరస్కరించారని కేటీఆర్‌ గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ పరిపాలనా దక్షతను దేశం మొత్తం గుర్తిస్తోందన్నారు.  సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు. రైతుల పక్షాన నిలబడకపోతే రాజకీయంగా పుట్టగతులుండవని ప్రధాని మోదీకి అర్థమైందని కేటీఆర్‌ అన్నారు. రైతుబంధు పథకాన్ని దేశమంతా అమలు చేయాలని ప్రధాని మోదీ ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ కాలంతో పోటీపడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు. విపక్షాలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు లొంగలేదని పేర్కొన్నారు. ట్రక్కు గుర్తు వల్ల మనకు ఓట్లు తగ్గిపోయాయని, 4వేల ఓట్ల తేడాతో 10 సీట్లు కోల్పోయామని తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

Other News

Comments are closed.