ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం?

share on facebook

– జగన్‌తో భేటీ అయిన తమ్మినేని
– స్పీకర్‌ పదవిని చేపట్టేందుకు సుముఖత
– అధికారంగా ప్రకటించడమే తరువాయి!
అమరావతి, జూన్‌7(జ‌నంసాక్షి) : ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ పదవి ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తిగా మారింది. పార్టీలో సీనియర్లకు పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ముగ్గురు నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. తాజాగా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంను స్పీకర్‌గా నియమిస్తారని జోరుగా ప్రచారం సాగుతుంది. శుక్రవారం మధ్యాహ్నం ఈ మేరకు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని తమ్మినేని సీతారాం కలిశారు. ఈ భేటీలో స్పీకర్‌ పదవిపై చర్చ సాగినట్లు తెలుస్తోంది. దీంతో సీతారాంను స్పీకర్‌ పదవికి జగన్‌ ప్రకటిస్తారని విస్తృత ప్రచారం జరుగుతుంది. శుక్రవారం ఉదయం వైసీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. కేబినెట్‌ కూర్పుపై చర్చించారు. మంత్రివర్గంలో ఎవరెవరికి బెర్త్‌ ఖాయమయ్యిందో దాదాపు ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. 25మంది మంత్రులతో కేబినెట్‌ ఉండే అవకాశ ముంది.. వీరిలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండే ఛాన్స్‌ ఉంది. శనివారం ఉదయం కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే వారికి సమాచారం కూడా అందినట్లు తెలుస్తోంది. అనంతరమే అసెంబ్లీ స్పీకర్‌ పదవిపై జగన్‌ దృష్టిసారించారు. పార్టీలో సీనియర్‌ ఎమ్మెల్యేల లిస్టును పరిశీలించిన జగన్‌ పలు పేర్లను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కాగా వీరిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంను ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఎంపికచేస్తే బాగుంటుందని జగన్‌ అనుకున్నదే తడవుగా తమ్మినేనికి తనను కలవాలని ఆహ్వానించారు. దీంతో తమ్మినేని సీతారాం శుక్రవారం మధ్యాహ్నం జగన్‌ను కలిసి పలు విషయాలపై చర్చించారు. స్పీకర్‌ పదవికి తమ్మినేని సుముఖత వ్యక్తం చేయడంతో స్పీకర్‌ పదవికి నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. తమ్మినేని సీతారాం బీసీ (కళింగ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇప్పటికే తన కేబినేట్‌లో బడుగు, బలహీన వర్గాలకు వైఎస్‌ జగన్‌ పెద్దపీట వేయడంతో.. స్పీకర్‌ పదవి కూడా ఆ వర్గాలకే కేటాయిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఆముదాలవలస నుంచి 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సీతారాం.. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985లో ప్రభుత్వ విప్‌గా, 1994లో చంద్రబాబు కేబినెట్‌లో మున్సిపల్‌ శాఖ మంత్రిగా సీతారాం సేవలందించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై తమ్మినేని సీతారాం 13,856 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  పార్టీలో సీనియర్‌ నేత కావడం.. మంచి వాక్చాతుర్యం ఉండటం.. సౌమ్యుడు కావడంతో జగన్‌ ఆయనవైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అందరిని కలుపుకొనిపోయే మనస్తత్వం ఉండటం కూడా తమ్మినేనిని ఎంపిక చేయడానికి కారణమంటున్నారు. దీనిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ రావాల్సి ఉంది.

Other News

Comments are closed.