ఐటి దాడుల్లో చిత్తశుద్ది ఏదీ?

share on facebook

ఐటి దాడులతో తెలంగాణ రాజకీయాలలో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఇప్పుడు ప్రధాన చర్చగా మారిపోయారు. దీనికితోడు ఆయన సవాళ్లు విసురుతున్నారు. తన ఆస్తులు..కెసిఆర్‌ ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్దమేనా అని కెసిఆర్‌కు సవాల్‌ విసిరారు. నిజానికి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలో అనేకమంది కాంగ్రెస్‌ నాయకుల ఇళ్లపై ఐటి దాడులు జరిగాయి. అనేకులపై కేసులు నమోదయ్యాయి. కొందరిని రిమాండ్‌కు పంపారు. అదే తరహాలో ఇప్పుడు తెలంగాణలో కూడా దాడులకు పాల్పడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కేవలం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారిపైనే దాడులు జరగడం, వారి కేసులను తిరగదోడడం రాజకీయ కక్షపూరితంగా జరుగుతన్నవన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఖమ్మం ఎంపి పొంగులేటి నివాసాలపైనా ఐటి దాడులు జరిగినా కంటితుడుపుగా సాగాయి. నిజానికి రాజకీయ నాయకులు అనేకులు అక్రమార్జనలకు నిలయంగా ఉన్నారు. వారిలో ఎందరో ఇప్పుడు అధికారంలో, విపక్షంలో ఉన్నారు. అలాంటి వారందరిపై దాడులు జరిగివుంటే ప్రజల్లో చర్చ మరోలా

ఉండేది. కానీ లక్ష్యం మేరకు దాడులు సాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ముందస్తు ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి, ఆయన బంధువుల నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు, ఈడీ అధికారులు చేసి సోదాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మానవ అక్రమ రవాణా కేసులో అరెస్ట్‌ చేశారు. చివరకు ఆయన ఇప్పుడు బెయిల్‌పై వచ్చారు. ఇకపోతే మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుపైనా అవినీతి ఆరోపణలు వచ్చాయి. దానిపై ఎలాంటి స్పందన రాలేదు. అందుకే ప్రజలు ప్రతి అంశాన్నీ రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. అందుకే ఇప్పుడు రేవంత్‌ వ్యవహారం కూడా రాజకీయంగా మారింది. మానవ అక్రమ రవాణా కేసులో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కొద్ది రోజుల క్రితం అరెస్ట్‌ చేయడం, ఇప్పుడు రేవంత్‌రెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేయడాన్ని ప్రజలు కూడా రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రేవంత్‌రెడ్డిపై దాడులు జరిగాయని ఒక వర్గం ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఎన్నికల సమయంలో ఇలాంటి దాడులు జరగడమే ప్రధాన కారణం. దీంతో ప్రజలకు వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోతోంది. జగన్‌ కేసు ఎన్నేళ్లయినా తేల్చలేదు. ఆరోపణలు బలంగా ఉన్నా,రుజువులు దొరికినా ఎందుకనో ఇంకా నాన్చుతూనే ఉన్నారు. దర్యాప్తు అధికారిగా ఉన్న ఆనాటి సిబిఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణను ఉన్నపళంగా కేసునుంచి తప్పించి బదిలీ చేశారు. ఇవన్న్నీ ప్రజలు ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉంటారు. ఆర్థిక నేరాలతో పాటు వివిధ రకాల నేరాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాల్సిన వ్యవస్థలను అధికారంలో ఉన్న పార్టీలు తమ గుప్పిట్లో పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే వాడుతున్నాయన్న అభిప్రాయం ప్రజానీకంలో విస్తృతంగా ఉంది. ఈ కారణంగా నిజంగా నేరం చేసినవాళ్లు కూడా తప్పించుకోగలుగుతున్నారు. సజావుగా విచారణలు చేసి శిక్షలు పడేలా చేసివుంటే వ్యవస్థలపై నమ్మకం పెరిగేది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డి విషయంలో ఇదే జరిగింది. అక్రమంగా సంపద పోగేసుకున్నారని సీబీఐ, ఈడీ వంటి సంస్థలు కేసులు పెట్టినా ఒక్కటి కూడా రుజువు కాలేదు. జగన్మోహన్‌రెడ్డిపై విచారణ జరపాలని ఆదేశించిన హైకోర్టే, ఆయన కేసుల్లో విచారణపై స్టే కూడా విధించింది. దీంతో విచారణ ఏళ్ల తరబడి సాగుతోంది. తనపై అవినీతి కేసులు నమోదైన తర్వాత జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసి విపక్షనేతగా ఉన్నారు. దీంతో తనను రాజకీయంగా వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పుకోవడం ద్వారా జగన్‌ ప్రయత్నించారు. ఆయన మాటలనే ఆయన అనుచరులు, అభిమానులు నమ్మారు. ఎందుకంటే కేసును ఎటూ తెమల్చకపోవడమే కారణంగా చూడాలి. చట్టాలు, నిబంధనల్లో ఉన్న లొసుగులను అధికార పార్టీ ఎప్పటికప్పుడు తమకు అనుగుణంగా ఉపయోగించుకుంటోంది. కోర్టులలో విచారణ వేగంగా సాగకపోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో నక్సలైట్‌ నయీం కేసు కూడా అలాగే నీరుగారింది. అలాగే మాదకద్రవ్యాల కేసు కూడా అతీగతీ లేకుండా పోయింది. మియాపూర్‌ భూకబ్జాల కేసుకూడా మాయమయ్యింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకానేక కేసులు వస్తాయి. ఫలానా వ్యక్తి అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు తెలిసినా ఏవిూ చేయడం లేదు. రాజకీయాల్లో ఉంటే కేసులు తేలవన్న విషయం కూడా ప్రజలకు అవగతమయ్యింది. చిన్న దొంగతనం చేసినా సామాన్యులకు ఊచలు తప్పడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా విపక్ష నేతలను ఇబ్బందులు పెట్టేలా కేసులను సాగదీస్తోందే తప్ప నిక్కచ్చిగా విచారణలు చేయించడం లేదు. అవినీతి నేతలను బోనెక్కించడం లేదు. రేపు మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎదుటి పక్షం వారు లక్ష్యంగా దాడులు సాగుతాయి. ఈ మాటలను వారే స్వయంగా చెబుతున్నారు. రేవంత్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌ నేతలు ఇవే మాటలు చెప్పారు. మేము అధికారంలోకి వస్తే కెసిఆర్‌ను ఊచలు లెక్కపెట్టిస్తామని శపథం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నవారిని వేధించేలా వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్వనం అక్కర్లేదు. అందుకే రాజకీయ నేతలపై నమోదవుతున్న కేసుల పట్ల ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోతున్నారు.

 

Other News

Comments are closed.