ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా విరాట్‌ కోహ్లీ

share on facebook

దుబాయ్‌, జనవరి18(జ‌నంసాక్షి) : ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించింది. 2017లో అత్యంత ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందుకోసం టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలోనూ ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంది. భారత పరుగుల యంత్రం, రికార్డుల రారాజు, కింగ్‌ కోహ్లీ 2017లో అంతర్జాతీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకుగాను ఐసీసీ సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబెర్స్‌ ట్రోఫీని అందుకున్నాడు. టెస్టు, వన్డే, టీ20 ఈ మూడు ఫార్మాట్లలోనూ విశేష ప్రతిభ కనబరిచిన ఆడటగాడికి ఐసీసీ ఈ అవార్డు అందజేస్తోంది. దీన్ని కోహ్లి కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి. అలాగే ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును కోహ్లీ దక్కించుకున్నాడు. కోహ్లీకి ఈ అవార్డు దక్కడం ఇది రెండోసారి. 2012లో చేసిన ప్రదర్శనకు గాను కోహ్లీ మొదటిసారి ఈ అవార్డును దక్కించుకున్నాడు. 2017లో కోహ్లీ 76.84 సగటుతో ఆరు శతకాలు నమోదు చేశాడు. 29 ఏళ్ల వయసులోనే కోహ్లీ వన్డేల్లో 32 శతకాలు సాధించాడు. సచిన్‌ 49 శతకాల రికార్డును కోహ్లీ ఎప్పుడు బద్దలుకొడతాడా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబెర్స్‌ ట్రోఫీని రవిచంద్రన్‌ అశ్విన్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరో పక్క భారత యువ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్‌ ఐసీసీ టీ20 ఫర్‌ఫామెన్స్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు అందుకున్నాడు. బెంగళూరులో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో చాహల్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. 25 పరుగులిచ్చి 6 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ప్రదర్శనకుగాను చాహల్‌ అవార్డు అందుకున్నాడు.

Other News

Comments are closed.