ఓటరు నమోదులో టిఆర్‌ఎస్‌ నేతల బిజీ

share on facebook

ఆదిలాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. ఓటరు జాబితా చేతబట్టుకుని ఇంటింటికీ తిరిగి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకుల పేర్లు ఓటరు జాబితాలో లేని వారి వివరాలను నమోదు చేసుకున్నారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన కేటీఆర్‌ ఆదేశాల మేరకు పట్టణంలో ప్రతి వార్డులో ఇంటింటికీ తిరిగి ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున పోటీ చేసిన అన్ని వార్డులను కైవసం చేసుకునేందుకు ప్రతి ఓటు కీలకమేనన్నారు. జనవరి 6తేదీ వరకు పార్టీ కార్యకర్తలు ఓటరు నమోదులో నిమగ్నం కావాలన్నారు. బీఎల్‌వోలతో కలిసి ఓటరు నమోదు చేయించాలని సూచించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది ఓటర్లు జాబితాలో పేరు లేక ఓటు హక్కు కోల్పోయారన్నారు. ఓటరు జాబితాలో తమ ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జాబితాలో పేరు చెక్‌ చేసుకోకుండా ఎన్నికల సమయంలో తమ పేర్లు లేవని ఆందోళన చేస్తే లాభం ఉండదన్నారు. ఇటీవల ఓట్లు గల్లంతైన వారందరూ తిరిగి తమ ఓటు హక్కు కోసం పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌ను ప్రతి ఇంటికీ తీసుకెళ్లడంలో భాగంగా పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ఓటరు నమోదు చేస్తున్నారన్నారు. పార్టీని బూత్‌స్థాయిలో పటిష్టం చేసి రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేస్తామన్నారు.

Other News

Comments are closed.