ఓ సామాన్యుడి మహాప్రస్థానం

share on facebook

రాజకీయాల్లో సొంత బాణీ,సొంత వాణితో శిఖర సమానంగా ఎదిగిన అరుదైన నాయకుల్లో కరుణానిధి ముందుంటారు. ఓ సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన తీరు కరుణానిధి జీవితం నేటి తరానికి ఓ పాఠం. ఓ రకంగా చెప్పాలంటే ఆయన జీవితం ఓ సక్సెస్‌ మంత్ర. కష్టపడే తత్వం ఆయన నుంచి నేర్చు కోవాల్సిందే. వయసు విూదపడుతున్నా ఆలోచనల్లో ఎక్కడా ముదిమితనం కనిపించని నిత్యయవ్వనుడిగా నిలిచిన ధీశాలి. అన్నింటికి మించి తను నమ్ముకున్న హేతువాదం నుంచి కించిత్తు కూడా పక్కకు జరక్కుండా నిలిచిన వజ్ర సంకల్పం ఆయనది. తల్లిదండ్రులు ఏ ముహూర్తాన ఆయనకు దక్షిణామూర్తి అని పేరు పెట్టారో గాని తమిళ ప్రజల మనస్సుల్లో కరుణానిధిగా వెలుగొందారు. ఓ మ¬న్నత శిఖరానికి చేరుకోవడానికి దగ్గరి దారులు లేవని, అకుంఠిత దీక్ష, కష్టపడేత తత్వం అవసరమని తన జీవితంతో నిరూపించిన మహాబలశాలి. తలచుకుంటే ఎలాంటి కార్యమైనా సాధించడం సాధ్యమే అన్న సామెతను జీవితంలో రుజువు చేసిన ప్రత్యక్ష సాక్షి ఆయన. హేతువాదమంటే దేవుడిని గుడ్డిగా వ్యతిరేకించకుండా, దేవుడి పేరువిూద జరుగుతున్న అకృత్యాలను వ్యతిరేకించడంతో పాటు, జీవితాంతం అదే సిద్దాంతానికి కట్టుబడి ఉండడమన్నది కేవలం కరుణానిధికి మాత్రమే సాధ్యమయ్యింది. కష్టాల్లోనూ ధైర్యం వీడని తత్వమే కరుణానిధి అసలుసిసలు విజయంగా చూడాలి. ద్రవిడ వాదం నినాదంగా.. హేతువాదం పునాదిగా ఆయన రాజకీయ ప్రస్థానం సాగినా అది పేదల పక్షంగానే ముగిసింది. దక్షిణాదిన ఎలుగెత్తి ద్రావిడ జెండా ఎగరేసిన ఉద్యమ సూరీడుగా దక్షిణామూర్తి చరిత్ర ముగిసినా నేటి తరానికి ఆయన జీవితం ఓ అధ్యయన అంశం అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. చదివింది మామూలు చదువే అయినా అసామాన్య ప్రతిభా పాటవాలు అన్నవి కష్టించి సాధించుకున్న ధీశాలి కురుణానిధి. పట్టుదలతో జీవితాన్ని, ప్రజలను చదివి ఎదిగిన మ¬న్నత శిఖరసమానుడు కరుణానిధి. సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న ప్రతిభా సంపన్నుడుగా

తమిళ సాహితీ సాంస్కృతిక రంగాల్లో అసమాన సృజనశీలిగా ఆయన పేరు సంపాదించడం అన్నది ఆయనలోని ఆత్మ సంఘర్షణకు నిలువుటద్దంగా చూడాలి. ప్రత్యర్ధులెవరైనా లెక్క చేయకుండా ఎదురొడ్డి ఢీకొట్టిన వ్యూహచతురతా చాణక్యం ఆయనకు మాత్రమే సొంతమన్నది నిరూపించుకున్న ఘటికుడు.

ద్రవిడ రాజకీయాల్లో ఉద్దండులతో తన ప్రస్థానం మొదలు పెట్టి తనే ఓ ఉద్దండ పిండంగా అవతరించిన రాజకీయ ఘటికుడు కరుణానిధి. ఆయన అస్తమయంతో తమిళనాట అనేకులు రోదిస్తున్నారంటే ఆయనపై ఎంతగా అభిమానంతో ఉన్నారో గుర్తించవచ్చు. డీఎంకే అధినేతగా అర్థశతాబ్దంపైగా విస్తరించిన తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన ఎన్నో ఉత్తానపథనాలు చూసి ఉంటారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. అయినా మొక్కవోనిదీక్షకు మారుపేరుగా నిలిచారు. ఎన్నడూ తనవిధానాల నుంచి పక్కకు తప్పుకోలేదు సరికదా..ఎన్నడూ జీవితంలో రాజీపడలేదు. అందుకే కరుణానిధి 13 దఫాలు ఎమ్మెల్యేగా గెలిచి, 5 సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించి, అర్థ శతాబ్దంపాటు పార్టీకి నేతృత్వం వహించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ద్రావిడ ఉద్యమాన్ని సామాజిక ఉద్యమంగా నిర్మించి తమిళుల ఆత్మగౌరవానికి ప్రతీకగా దానిని నిలిపిన ధీరత్వం ఆయనది. ద్రవిడ ఉద్యమం స్వాభిమానానికి, తద్వారా వ్యక్తిత్వ వికాసానికి పెద్దపీట వేసింది. కరుణానిధి ద్రవిడోద్యమంలో భాగంగా మొట్టమొదలు విద్యార్థి విభాగాన్ని నెలకొల్పి తోటి విద్యార్థులలో రచనా కౌశలాన్ని నూరిపోశారు. ఉద్యమానికి సంఘసేవను పర్యాయపదంగా మార్చారు. తమిళనాడులోని కళ్ళగూడి పారిశ్రామిక నగరం పేరును పారిశ్రామిక వేత్త పేర దాల్మియాపురంగా మార్చినప్పుడు, ఉత్తర భారత ఆధిపత్యానికి వ్యతిరేకంగా డీఎంకే ఉద్యమం

సాగించింది. కమ్యూనిస్టు రాజకీయాలను మించి ద్రవిడ ఉద్యమం భారత రాజ్యానికి సవాలు విసిరిన కాలమది. ఎన్నికలకు దూరంగా ఉండాలనే పెరియార్‌ వాదనను కూడా వ్యతిరేకించి ,పెరియార్‌తో విభేదించిన అన్నాదురై డిఎంకెను స్థాపించగా ఆయనతో పాటు నడిచి నిలిచి గెలిచాడు. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా తమిళ రాజకీయాలలోనే కాదు, దేశ రాజకీయాలలోనూ బలమైన ముద్రవేసిన నేతగానే కరుణానిధి పేరొందారు. దేశంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే తమిళ రాజకీయాలు తమ వైవిధ్యాన్ని నిలబెట్టుకుంటూనే ఉండడానికి కరుణానిధే కారణంగా చెప్పుకోవాలి. దశాబ్దాలు గడిచినా దేశంలో ఎన్ని ప్రభంజనాలు వీచినా జాతీయ పార్టీలు ఇప్పటికీ తమిళనాడులో కాలు మోపలేక పోతు న్నాయి. ఉత్తరాది పెత్తనాన్ని నిలువరించిన వారిలో కరునానిధి అగ్రగణ్యుడని చెప్పక తప్పదు. చివరి వరకు ముదిమి విూదపడుతున్నా ఏనాడూ తన ఆలోచనల్లో అలాంటి ఛాయలు రాకుండా నిరంతర రాజకీయాలు నెరపి వాటిపై తనదైన ముద్ర వేసిన రాజకయీవేత్త కరుణానిధి. అంతర్జాతీయంగా పెత్తందారీతనాన్ని వ్యతిరేకించడం, దేశీయంగా ఉత్తర భారతీయ ఆధిపత్యాన్ని, సామాజికంగా అగ్రవర్ణ దాష్టీకాన్ని ప్రతిఘటించడం ఆయన జీవ లక్షణాలుగా చూడాలి. సోవియట్‌ అధినేత స్టాలిన్‌ మరణించిన సమయంలో జన్మించిన తన కుమారుడికి ఆయన పేరు పెట్టడం ద్వారా కమ్యూనిస్ట్‌ భావజాలం కన్నా ఆ నేత పట్ల ఉన్న అభిమానం గుర్తు చేసుకోవచ్చు. తమిళ రాష్ట్రాన్ని , ప్రజలను భారతదేశం నేడు ప్రత్యేకంగా పరిగణిస్తూ ఉండడం వెనుక ద్రవిడ ఉద్యమం మూలాలు, తమిళుల అస్తిత్వ ఉద్వేగాలను సజీవంగా నిలిపి ఉంచిన ఘనత కరుణానిధిదే. సైద్ధాంతిక నిబద్ధత, సొంత రాజకీయ, సాంఘిక అభిప్రాయాలు కలిగిన వ్యక్తిగా భారత రాజకీయాల్లో ఆయనదో చరిత్ర పుట అనడంల ఎలాంటి సందేహం లేదు.

 

Other News

Comments are closed.