కడప ఉక్కుపై భగ్గుమన్న రాజకీయ పక్షాలు

share on facebook

కేంద్రం తీరుపై మండిపడ్డ నేతలు

బిజెపి తీరుకు నిరసనగా ర్యాలీలు, ఆందోళనలు

కడప,జూన్‌14(జ‌నం సాక్షి): కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం కుదరదని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయడంపై కడప జిల్లాలో రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయి. కేంద్రం తీరును నిరసిస్తూ ఆందోళనలు చేపట్టారు. మానవహారాలు నిర్మించి నిరసనలు ఉధృతం చేశాయి. ఎక్కడిక్కడ ర్‌ఆయలీలు, నిరసన ప్రదర్శనలతో కేంద్రం తీరును ఎండగట్టారు. విభజన చట్టంలో పేర్కొన్న హావిూని సైతం కేంద్రం నెరవేర్చడం లేదంటూ పార్టీలకతీతంగా జిల్లావ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. తెదేపా,లెఫ్ట్‌ వైకాపా సహా పలు పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు, ర్యాలీలు చేపట్టాయి. ర్యాలీలు తీసిన లెఫ్ట్‌ నేతలు కేంద్రం దిష్టిబొమ్మను తగులబెట్టారు. బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేయడంతో ఆ సెగ భాజపా నాయకులకు తగిలింది. కడప నగరంలోని భాజపా సీనియర్‌ నేత కందుల రాజమోహన్‌ రెడ్డి ఇంటి ముట్టడికి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ యత్నించింది. ఆర్సీపీ నాయకుడు రవిశంకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు కందుల ఇంటికి ర్యాలీగా వెళ్లారు. విషయం ముందే పసిగట్టిన పోలీసులు కందుల ఇంటి వద్ద మోహరించారు. నిరసనకారులు భాజపా నేత ఇంటిని ముట్టడించేందుకు తీవ్రంగా యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసగా వారంతా రోడ్డుపై బైఠాయించారు. కార్యకర్తలందరినీ పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదే సందర్భంగా కోటిరెడ్డి కూడలి వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. కడప ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. సీపీఐ నాయకులు కూడా ఏడు రోడ్ల కూడలి వద్ద ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో మైదుకూరులో తెదేపా నాయకులు ఆందోళన నిర్వహించారు. పట్టణంలోని నాలుగురోడ్ల కూడలి చేరుకున్న పార్టీ కార్యకర్తలు, నాయకులు కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎండలో నడిరోడ్డుపై భైఠాయించి నిరసన వ్యక్తం చేయగా స్థానిక వీఆర్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు తెదేపా నాయకుల ఆందోళనకు మద్దతుగా మానవహారంగా ఏర్పడ్డారు. ఉక్కు పరిశ్రమ కోసం నినదించారు. కొద్దిసేపు వాహన రాకపోకలను అడ్డుకున్నారు. ఉక్కు పరిశ్రమ కోసం అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని హావిూ ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం ఆందోళన జరుగుతున్నా వైకాపా నాయకుడు జగన్మోహన్‌రెడ్డి, జనసేన నాయకుడు పవన్‌కల్యాణ్‌ నోరుమెదపక పోవడాన్ని ప్రశ్నించారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రొద్దుటూరులో తెదేపా ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. టీబీ రోడ్డు నుంచి శివాలయం సర్కిల్‌ వరకు సాగిన ఈ ప్రదర్శన అనంతరం మానవహారంగా ఏర్పడి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు, గతంలో జరిపిన చర్చల మేరకు కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉప రాష్ట్రపతి నేతృత్వంలో కూడా దీనిపై చర్చలు జరిగిన తరువాత కూడా ఎందుకు ఆలస్యం చేస్తన్నారని తెదేపా నాయకులు ప్రశ్నించారు.రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేస్తోందని వైకాపా ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి అన్నారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయంటూ మెకాన్‌ సంస్థ కేంద్రానికి నివేదిక ఇచ్చిందన్నారు. కానీ మెకాన్‌ సంస్థ నివేదికను కేంద్రం పట్టించు కోకుండా సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ కడప అంబేద్కర్‌ కూడలి వద్ద వైకాపా నేతలు ధర్నా నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎంపీ అనంతరం అక్కడే బైఠాయించి కేంద్ర వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. నాలుగేళ్లుగా విభజన హావిూలపై పోరాటం చేయని తెలుగుదేశం నాయకులు ఇపుడు ఆందోళన చేయడం ఏంటని ఎంపీ ప్రశ్నించారు.

 

Other News

Comments are closed.