కర్నాటక ఫలితాలు మోడీ పతనానికి నాంది

share on facebook

ఫలితాల ప్రభావం వచ్చే ఎన్నికలపైనా ఉంటుంది

తెలంగాణలోనూ మహాకూటమిదే విజయం

ఫలితాలపై ఎపి మంత్రుల స్పందన

అమరావతి,నవంబర్‌6(జ‌నంసాక్షి): కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు మోదీ పతనానికి నాంది అని ఏపీ మంత్రులు వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలు వచ్చే ఎన్నికలపై తప్పకుండా ప్రభావం చూపుతాయని మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి అన్నారు. కర్ణాటకలో జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం మోదీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని, ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించారన్నారు. కాంగ్రెస్‌ను చీల్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అయినప్పటికీ ఈరోజు కర్ణాటక ఉపఎన్నికల్లో ఐదింట నాలుగు చోట్ల కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి విజయం సాధించిందని అన్నారు. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి షాక్‌ ఇస్తూ జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమికి ప్రజలు మద్దతుగా నిలిచారని, ఇది బిజెపికి ఎదురుదెబ్బ అని కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి స్పందించారు. కర్నాటకలో బీజేపీకి ప్రజలు కోలుకోలేని షాక్‌ ఇచ్చారని… బీజేపీకి ఆ రాష్ట్ర ప్రజలు తగిన బుద్ది చెప్పారన్నారు. కర్నాటకలో వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలే దేశంలో జరుగుతున్న పరిణామాలకు అద్దం పడుతోందన్న సోమిరెడ్డి… రేపు తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లోనూ మహాకూటమిదే విజయం అనే ధీమా వ్యక్తం చేశారు. శివమొగ్గలో యడ్యూరప్ప కుమారుడు వందలకోట్లు దారపోయడం వల్లే గెలుపొందారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికలపై కర్ణాటక ఎన్నికల ప్రభావం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో చంద్రబాబు చేసిన ప్రయత్నానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలే సూచికన్నారు. మోదీ గ్దదె దించే వరకు మహాకూటమి లక్ష్యమన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పతనం ఇప్పటికే మొదలైందన్నారు. కర్ణాటకలో వచ్చిన ఫలితాలే తెలంగాణలోనూ వస్తాయని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ…తెలంగాణలో కేసీఆర్‌ వైఫల్యాలు వచ్చే ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్‌-జేడీఎస్‌ మెజార్టీ సాధించిందని తెలిపారు. తెలంగాణలో చంద్రబాబు ప్రభావంతో మహాకూటమి విజయం సాధిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఉపఎన్నికల్లో జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమికి లభించిన ఫలితం 2019 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఉంటుందని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో చంద్రబాబు ఏర్పాటు చేసిన బీజేపీయేతర కూటమికి ఇది నాంది అని మంత్రి ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.

 

 

Other News

Comments are closed.