కాంగ్రెస్‌లో చేరిన వారికి..  విూరెంతించారు?

share on facebook

– తెరాసకు డబ్బులిచ్చి చేర్చుకోవాల్సిన అవసరం లేదు
– అభివృద్ధిని చూసి తెరాసలో చేరుతున్నారు
– ఐటీ గ్రిడ్‌ తప్పుచేయకపోతే బాబుకు భయమెందుకు
– ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేయడం నేరమా?
– ఫిర్యాదు దారుడిపై ఏపీ పోలీసుల దౌర్జన్యమేంటి
– అసలు తెలంగాణలో ఏపీ పోలీసులకు పనేంటి?
– బాబు, లోకేశ్‌కు బుకాయింపు మాటలెక్కువ
– తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
హైదరాబాద్‌, మార్చి4(జ‌నంసాక్షి) : తెలంగాణలో కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నేతలు తెరాసలో చేరుతున్నారని, కానీ ప్రతిపక్ష నేతలు డబ్బులిచ్చి కొనుగోలు చేస్తున్నారని సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. తమ పార్టీ నుంచి గెలిచిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని అసెంబ్లీ ఎన్నికల ముందు విూరు ఎంతకు కొన్నారని కౌంటర్‌ ప్రశ్న వేశారు. టీడీపీ నుంచి గెలిచిన రేవంత్‌ రెడ్డిని ఎంతకు కొన్నారని, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు భూపతి రెడ్డి, యాదవ రెడ్డిలను ఎంతకు కొనుగోలు చేశారో ఉత్తమ్‌ చెప్పాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యూపీలో  ఆదివారం రాహుల్‌ సమక్షంలో బీజేపీ ఎంపీ చేరిన విషాయాన్ని కేటీఆర్‌ గుర్తుచేశారు. ఆమెకు ఎంత డబ్బులు పెట్టి కొన్నారని ప్రశ్నించారు. వీటన్నింటిపై ఉత్తమ్‌ సమాధానం ఇవ్వాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. రాజకీయాల్లో పార్టీలు మారడం కొత్తేమి కాదని, పార్టీ ఫిరాయింపును గతంలో ప్రోత్సహించింది కాంగ్రెస్‌ పార్టీనే అని కేటీఆర్‌ విమర్శించారు. వైఎస్సార్‌సీపీకి చెందిన 22 ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసినప్పుడు ఉత్తమ్‌ ఎక్కడపోయారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ గిరిజనుల సంక్షేమ కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారని కేటీఆర్‌ వెల్లడించారు. తమ నాయకత్వంలో బలం లేదని, ఉత్తమ్‌ కుమార్‌ను మార్చాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌ గుర్తుచేశారు. విూ నాయకత్వంలో సమర్థత లేక తమపై నిందనలు వేయడం ఏంటని ప్రశ్నించారు.
ఐటీ గ్రిడ్‌ తప్పుచేయకుంటే బాబుకు భయమెందుకు?
హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తున్న ఐటీ గ్రిడ్‌ సంస్థ తప్పు చేయకపోతే ఏపీ సీఎం చంద్రబాబుకు భయం ఎందుకని కేటీఆర్‌ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం విూద ఆరోపణలు చేయడానికి చంద్రబాబుకు సిగ్గుండాలని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో పార్టీలు మారడం తప్పుకాదని, చంద్రబాబు కూడా పార్టీ మారిన వ్యక్తేనని అన్న ఆయన, బుకాయింపు మాటలు చెబుతూ, ప్రజలను మోసం చేయడమే తప్పని అన్నారు. తన తండ్రికి తగ్గట్టుగానే లోకేశ్‌ కూడా బుకాయించడాన్ని వంటబట్టించుకున్నారని నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరకలేదా? అని ప్రశ్నించిన కేటీఆర్‌, ఏపీకి చెందిన వ్యక్తి తెలంగాణలో ఫిర్యాదు చేసినా, ముంబైలో ఫిర్యాదు చేసినా, ఫిర్యాదు చేసిన చోటనే కేసు నమోదవుతుందన్న కనీస ఇంగిత జ్ఞానం చంద్రబాబుకు లేకపోయిందని ధ్వజమెత్తారు. ఇక్కడున్న ఓ సంస్థ నిర్వాకాలపై ఫిర్యాదు వస్తే స్పందించడం, కేసు పెట్టి విచారించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించారన్న ఫిర్యాదు నిజమేనని తెలుస్తోందని, దీనిపై పూర్తి వివరాలు విచారణ తరువాతే వెలుగులోకి వస్తాయని అన్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇంటిపై ఏపీ పోలీసులు దాడులకు దిగే ప్రయత్నం చేశారని, అందుకే వారిని తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఎవరికైనా భద్రత కల్పించే బాధ్యత ఏపీ పోలీసులపై ఉందన్నారు. తెలంగాణలో ఉన్న సంస్థపై తెలంగాణలో నివాసముంటున్న ఏపీ వ్యక్తి లోకేశ్‌రెడ్డి ఫిర్యాదు చేస్తే.. బాధ్యతగా తెలంగాణ పోలీసులు విచారణ చేశారని అన్నారు. దానిని అడ్డుకోవటానికి ఏపీ పోలీసులకు అవసరమేంటని కేటీఆర్‌ ప్రశ్నించారు. అసలు తెలంగాణలో ఏపీ పోలీసులకు పనేంటని నిలదీశారు. విచారణలో ఏపీ ప్రభుత్వం సిగ్గుమాలిన చర్య బయటపడుతుందని భయంతోనే చంద్రబాబు ఇలాంటి చర్యలకు దిగుతున్నారని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ పోలీసులు పక్షపాతం లేకుండా దర్యాప్తు చేస్తున్నారని, ఐటీ చట్టం ప్రకారం విచారణ జరుపుతున్నారని చెప్పారు. అయినా తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రజల డేటాతో ఏం అవసరమని ప్రశ్నించారు. సానుభూతి కోసమే సీఎం చంద్రబాబు ఇలాంటి ఆరోపణలకు పాల్పడుతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు.

Other News

Comments are closed.