కాంగ్రెస్‌లో లోక్‌సభ సీట్ల పోటీ

share on facebook

అందరి దృష్టి ఆ రెండు స్థానాలపైనే
వనపర్తి,మార్చి4(జ‌నంసాక్షి):  పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ నేడో, రేపో వెలువడనుంది. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని ఇటీవలే కేంద్ర ఎన్‌ఇనకల సంఘం కూడా ప్రకటించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు పార్లమెంట్‌ స్థానాలు ఉన్నాయి. వీటిలో నాగర్‌కర్నూల్‌ ఎంపీగా
కాంగ్రెస్‌ నేత నంది ఎల్లయ్య, మహబూబ్‌నగర్‌ ఎంపీగా టీఆర్‌ఎస్‌ నేత జితేందర్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఇక కాంగ్రెస్‌ నుంచి ఈ రెండు స్థానాలకు పోటీ చేయాలనుకున్న ఆశావహులు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో నాగర్‌కర్నూల్‌ స్థానానికైతే భారీ పోటీ నెలకొంది. ప్రధానంగా నాగర్‌ కర్నూలు నుంచి మళ్లీ నంది ఎల్లయ్య పోటీకి సిద్దం అవుతుండగా టిఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎంపి మందా జగన్నాధం టిక్కెట్‌ ఆశిస్తున్నారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్‌లో టికెట్ల హడావుడి మొదలైంది.  ఇప్పటికే పార్లమెంట్‌ స్థానాలకు పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఇటీవల ముగియగా.. వీటిని వడపోసి టీ పీసీసీకి అందజేసే బాధ్యతను జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులకు అప్పగించారు. దీంతో డీసీసీ అధ్యక్షులు ఒక్కో స్థానం నుంచి ఐదుగురితోకూడిన జాబితా రూపొందించి పీసీసీకి అందజేస్తారు.ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానం జనరల్‌ రిజర్వేషన్‌ కాగా, నాగర్‌ కర్నూల్‌ ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానం. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో పార్టీ బలంగానే ఉండటంతో పోటీలో నిలవాలని వారి జాబితా కూడా అధికంగానే ఉంది. ఇటీవల పార్లమెంట్‌ ఎన్నికల టికెట్ల దరఖాస్తులు ఆహ్వానించడంతో మహబూబ్‌నగర్‌ పార్లమెంటు స్థానానికి 11 దరఖాస్తులు రాగా, నాగర్‌కర్నూల్‌ స్థానానికి అత్యధికంగా 36 దరఖాస్తులు వచ్చాయి.  కాంగ్రెస్‌ పార్టీలో ఎక్కువ సార్లు సిట్టింగ్‌లకు ప్రాధాన్యం ఇవ్వడం ఆనవాయితీ. తద్వారా ఈసారి కూడా తనకే టికెట్‌ కేటాయించాలని నాగర్‌ కర్నూల్‌ ఎంపీ నంది ఎల్లయ్య మరోసారి అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, అలంపూర్‌ మాజీ
ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌, మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి కూడా దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. వీరే కాకుండా ఏ.చంద్రశేఖర్‌, మాణిక్యాల చెన్నయ్య, మల్లు రమేష్‌, కోటూరి మానవతారాయ్‌, కొండ్రు పుష్పలీల, పి.సుశ్మిత శంకర్‌రావు, పి.శంకర్‌రావు తదితరులు అనేకులు  కూడా నాగర్‌కర్నూల్‌ స్థానం నుంచి టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇకపోతే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన  కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి బరిలోకి దిగి గెలిచి తీరాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా డీ.కే అరుణ, రేవంత్‌రెడ్డిలు అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ స్థానం నుంచి టికెట్‌ కోసం వంశీచంద్‌రెడ్డి, చల్లా వెంకట్రాంమిరెడ్డి, కేవీఎన్‌.రెడ్డి, చిత్తరంజన్‌దాస్‌, సూగప్ప, సంజీవ్‌ ముదిరాజ్‌తో పాటు మరో ఐదుగురు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

Other News

Comments are closed.