కాంగ్రెస్‌ నేతలకు ఇంగితజ్ఞానం లేదు

share on facebook

– గవర్నర్‌ నిజాలు మాట్లాడితే కాంగ్రెసోళ్లకు మింగుడుపడటం లేదు
– కాంగ్రెస్‌ నేతలు తీరుమార్చుకోకపోతే తగిన గుణపాఠం తప్పదు
– టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌
హైదరాబాద్‌, జనవరి22(జ‌నంసాక్షి) : రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌పై కాంగ్రెస్‌ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ తప్పుబట్టారు. కాంగ్రెస్‌ నేతలకు ఇంగితజ్ఞానం లేదని ఆయన మండిపడ్డారు. సోమవారం తెరాస భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్‌ ప్రశంసిస్తుంటే కాంగ్రెస్‌ నేతలు ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న గవర్నర్‌పై కామెంట్స్‌ చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ నేతలు దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. గవర్నర్‌ పదవిని రబ్బర్‌స్టాంప్‌గా మార్చిందే కాంగ్రెస్‌ అని ఎమ్మెల్సీ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను గవర్నర్‌ మెచ్చుకుంటుంటే.. కాంగ్రెస్‌ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ నరసింహన్‌ను ప్రశంసిస్తుంటే.. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు విమర్శించడం సరికాదన్నారు. గవర్నర్లను అడ్డంపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర కాంగ్రెస్‌దేనని దుయ్యబట్టారు. గవర్నర్‌ ఆఫీసును పార్టీ కార్యాలయంగా మార్చింది కాంగ్రెస్సేనని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌పై ఇష్టారీతిలో వ్యాఖ్యలు చేయడం మాని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని హితవు పలికారు. లేకుండా వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా ఏకమై రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌ను తరిమేస్తారని హెచ్చరించారు.

Other News

Comments are closed.