కాంగ్రెస్‌ స్వార్థ రాజకీయాలు మానుకోవాలి: ఎమ్మెల్యే

share on facebook

సిద్దిపేట,సెప్టెంబర్‌13(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ చెల్లని కాసని, ప్రజల్లో ఆదరణ కోల్పోవడంతో పాటు తెలంగాణలో ఉనికి కోల్పోతున్నామన్న భయమంతో ప్రాజెక్టుకలు మోకాలడ్డుతోందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మండిపడ్డారు. అలాగే రైతు సమన్వయ సమితుల ఏర్పాటును కూడా అడ్డుకుంటోందని అన్నారు. రైతులు బాగుపడడం వారికి ఎకరాకు నాలుగువేలు ఆర్థిక సాయం అందడం ఇష్టం లేదన్నారు. అసంఘటితంగా ఉన్న రైతన్నలను సంఘటితం చేసి పండించిన పంటలకు స్వయంగా గిట్టుబాటు ధర నిర్ణయించే స్థాయికి అన్నదాతలను తీసుకురావటమే రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ముఖ్య ఉద్దేశమన్నారు. దేశంలో 70శాతం ఉన్న రైతులకు మాత్రం సంఘం లేకపోవటం విచారకరమని అన్నారు. సామాన్యుని నుంచి ఎంపీ వరకు ప్రతి ఒక్కరూ రైతు కుటుంబమనే అంటున్నప్పుడు ఏళ్ల తరబడి అన్నదాతల బతుకు ఎందుకు మారటం లేదని ప్రశ్నించారు. ప్రతి ఏటా అప్పులు పాలవుతున్న రైతన్న వారసులకు ఏమి ఇచ్చాడని వెనక్కి చూసుకుంటే అప్పులే కనిపిస్తున్నాయి. దీనికి అంతం లేదా అని ఆలోచన చేసి సీఎం కేసీఆర్‌ సమన్వయ సమితుల ఏర్పాటుతో ముందడుగు వేశారన్నారు. ఇందుకోసం రూ.500 కోట్లు కార్పస్‌ ఫండ్‌ను కేటాయించినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో రైతే రాజుగా నిలబడాలని ఆత్మగౌరవంతో ఆనందంగా వ్యవసాయం చేసుకోవాలని అన్ని విధాలా ప్రభుత్వం తరుపున భరోసా కల్పిస్తున్నారని స్పష్టం చేశారు. అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటితం చేయటం ద్వారా రైతు బతుకులు మార్చటం సాధ్యమవుతుందని గ్రహించి సమన్వయ సమితులను గ్రామస్థాయికి తీసుకొస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. మల్లన్నసాగర్‌ విషయంలోనూ కాంగ్రెస్‌ అసత్యాలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేసిందన్నారు. కాంగ్రెస్‌ నేతలు తమ రాజకీయ స్వార్థంతో రైతుల పొట్టకొడుతున్నారని, ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్‌ పూనుకోగా కాంగ్రెస్‌ పార్టీ నేతలు వాటికి ఆటంకాలు కల్పించేందుకు బయల్దేరారని తెలిపారు. ప్రాజెక్టుల ద్వారా సత్ఫలితాలు అందాలంటే రిజర్వాయర్లు నిర్మించకుంటే ఎలా అని అన్నారు. తెలంగాణలో నీటి వసతులు పెంచాలన్న సంకల్పాన్ని కాంగ్రెస్‌, టిడిపిలు అడ్డుకుంటున్నాయని అన్నారు. కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక విమర్శిస్తున్నారని చెప్పారు. మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల ప్రజలకు ఇప్పటి కంటే మెరుగైన జీవితాన్ని కల్పించేందుకు తనవంతుగా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

Other News

Comments are closed.