కామారెడ్డి ఆస్పత్రిస్థాయి పెంచాలి

share on facebook

పెరుగుతున్న రోగులతో సౌకర్యాల కొరత
కామారెడ్డి,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): కామారెడ్డి ఆస్పత్రి స్థాయి పెంపుపై ఆశలు నెలకొన్నాయి. 100 పడకల ఆస్పత్రిని 300 పడకల ఆస్పత్రిగా మారిస్తే రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు.  నిత్యం 700 మంది ఓపీ పరీక్షలకు వస్తుంటారు. 50-75 మంది చికిత్స పొందుతుంటారు.
మౌలిక వసతులు మృగ్యమయ్యాయి. తాగునీటి కొరత ఉంది. శవ పరీక్ష గది ఆస్పత్రి ఆవరణలో నివాసాల చెంతనే ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా చర్యలు లేవు. 300 పడకల ఆస్పత్రిగా మార్చి నిధులు వెచ్చిస్తే చక్కటి వైద్య సేవలందించేందుకు ఆస్కారం ఉంటుంది. రోగుల రద్దీకి అనుగుణంగా వైద్యసేవలు అందించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లా కేంద్రంలో ప్రాంతీయా స్పత్రికి వచ్చే రోగుల తాకిడిని తట్టుకునేందుకు చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం ఉన్న సమస్యలను గుర్తించి వైద్యశాఖకు నివేదిక అందజేయాలని నిర్ణయించారు. కామారెడ్డి జిల్లా కేంద్రం నాలుగు జిల్లాల కూడలిగా ఉండటంతో ఇక్కడకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలోనే ఇతర ఆస్పత్రులతో పోలిస్తే ఇక్కడ 2-3 రెట్లు రోగులు ఎక్కువగా వస్తున్నారు. మెదక్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల రోగుల తాకిడి ఉంది. 100 పడకల ఆస్పత్రిగా ఏర్పాటైన ఆస్పత్రికి గతంతో పోలిస్తే చికిత్స నిమిత్తం వచ్చే రోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. మరోవైపు ప్రసూతి వైద్యం ఇక్కడే అందిస్తుండటంతో పరిస్థితి జటిలంగా తయారైంది. ఇరుగ్గా ఉండటం, సరిపడా సిబ్బంది లేకపోవడంతో వైద్యం గగనమవుతోంది. ప్రసూతి సేవలు సక్రమంగా అందడం లేదు. వైద్యులు, సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చిన్నపాటి కేసులను కూడా ప్రాంతీయాస్పత్రికి సిఫారసు చేస్తున్నారు. ఫలితంగా రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.  మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఆస్పత్రికి నీటి వసతి కల్పించాలని నిర్ణయించారు. ఇక్కడ ఉన్న నీటి సమస్య దృష్ట్యా తగిన చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. వైద్య రంగానికి నిధుల కేటాయింపులకు అధిక నిధులు కేటాయిస్తే మేలు. తద్వారా మెరుగైన సేవలందించడంలో ఇబ్బందులను అధిగమించే వీలుంటుంది. జిల్లా ఆస్పత్రిగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకుంటే స్థానిక వాసులకు మేలు జరుగుతుంది. జిల్లా కేంద్రంలోని ప్రాంతీయాస్పత్రికి నిత్యం 10 ప్రసవ కేసులు వస్తుంటాయి. నెలకు 300 వరకు సాధారణ, శస్త్రచికిత్స ప్రసవాలు చేస్తున్నారు. ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒకటి, రెండు కేసులు మినహా ప్రసవాలు జరగడం లేదు. సౌకర్యాలు లేక ప్రసూతి సేవలందడం లేదు. కామారెడ్డి ప్రాంతీయాస్పత్రిలో ఉన్న ప్రసూతి కేంద్రాన్ని ఇక్కడే ఉంచి మిగతా విభాగాలను వేరేచోటకు తరలిస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Other News

Comments are closed.