కాలువలోకి దూసుకెళ్లిన బస్సు: 10మంది మృతి

share on facebook

22brk-31cకూసుమంచి: ఖమ్మం జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వెళ్తున్న యాత్రాజినీ బస్సు అదుపుతప్పి కాల్వలో బోల్తాపడింది ఈ ప్రమాదంలో 10మంది మృతిచెందగా, 18మంది ప్రయాణికులు గాయపడ్డారు.

హైదరాబాద్‌లోని మియాపూర్‌ నుంచి ఆదివారం రాత్రి యాత్రాజినీ బస్సు కాకినాడ బయలుదేరింది. తెల్లవారుజామున 2.30గంటలకు నాయకన్‌గూడెం వద్దకు చేరుకోగానే బస్సు అదుపుతప్పి నాగార్జునసాగర్‌ ఎడమకాలువ వంతెనపై నుంచి బోల్తాపడింది. ఘటనా స్థలంలో ఏడుగురు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతిచెందారు. 18 మంది క్షతగాత్రులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నారు. బాధితుల్లో ఎక్కువ మంది తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవారే ఉన్నారు. అతివేగం, డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి కాల్వలో బోల్తాపడిందని బాధితులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ పరారయ్యాడు. స్థానికులు బస్సులోంచి క్షతగాత్రులను బయటకు తీశారు. 3 అంబులెన్స్‌ల్లో బాధితులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా ఎస్సీ షానావాజ్‌ ఖాసీం, డీఎస్పీ సురేశ్‌కుమార్‌ ఘటనాస్థలికి చేరుకొని సహాయకక చర్యలను పర్యవేక్షించారు. రెండు భారీ క్రేన్ల సాయంతో కాల్వలోంచి బస్సును బయటకు తీశారు. దాదాపు 5గంటల పాటు సహాయకచర్యలు కొనసాగాయి.

క్షతగాత్రులు వీరే
ప్రమాదంలో గాయపడిన సత్యనారాయణ(రామచంద్రాపురం), బాలకృష్ణ(ద్రాక్షారామం), ధనలక్ష్మి(ద్రాక్షారామం), భాస్కర్‌రావు(ద్రాక్షారామం),లక్ష్మణ సతీశ్‌(రాజమండ్రి), ఫణి (కాకినాడ), వెంకటేశ్వర్లు(పెనుమళ్ల), ప్రేమకుమారి(కాకినాడ), సూర్యకుమారి(యానాం), నాగమణి(గోపవరం), వెంకటసూర్యసాయి(ద్రాక్షారామం), లక్ష్మీమణి, గణేశ్‌, బస్సు క్లీనర్‌ మహేశ్‌(మహబూబ్‌నగర్‌) ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాయకన్‌గూడెం గ్రామస్థులు, స్థానిక మత్స్యకారులు, రెండు భారీ క్రేన్ల సాయంతో కాల్వలోంచి బస్సును బయటకు తీశారు. దాదాపు 5గంటల పాటు సహాయక చర్యలు కొనసాగాయి.

డ్రైవర్‌ తప్పిదం వల్లే..
బస్సు డ్రైవర్‌ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటన అనంతరం పరారీలో ఉన్న డ్రైవర్‌ కోసం గాలింపు చేపట్టారు. ప్రమాద ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

బస్సు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అదించాలని సీఎం ఆదేశించారు.

మెరుగైన వైద్యం అందించాలి: సీఎం కేసీఆర్‌
నాయకన్‌గూడెం వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబీకులకు సమాచారం చేరవేసి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

 

 

Other News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *