కాలుష్య విషవలయంలో ఢిల్లీ

share on facebook

– ఒకరోజు గడిపితే 45 సిగరెట్లు తాగినట్లే

న్యూఢిల్లీ,నవంబర్‌ 10,(జనంసాక్షి): దేశరాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది.. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.. ముఖ్యంగా దీపావళి తర్వాత కాలుష్యం అనూహ్యంగా పెరిగిపోయింది. ప్రస్తుతం గాలిలో స్వచ్ఛత అత్యంత ప్రమాదకరస్థాయిని దాటేసి ప్రాణాంతక స్థితికి చేరుకుంది. ఢిల్లీలో ఒక్క రోజు గడిపితే 45 సిగరెట్లు తాగినంత హాని జరుగుతుంది. గాలిలో కాలుష్యం నాణ్యత సూచి ప్రకారం 100 పాయింట్లు దాటితేనే ప్రమాదంగా పరిగణిస్తారు. అలాంటిది ఏక్యూఐ 999కు చేరుకోవడంతో ఢిల్లీవాసులకు మరింత ప్రమాదంగా పరిణమించింది. కాలుష్య కాసారంగా మారిన ఈ గాలిని పీల్చితే ప్రాణాలు పోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కనీసం మరో రెండు రోజుల పాటు ఈ పరిస్థితి కొనసాగుతుందని కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరికలు జారీ చేసింది. నగరమంతా పొగ మంచు ఆవహించగా, రహదారులపై పట్టుమని పది కిలోవిూటర్ల వేగంతో కూడా ప్రయాణించలేని దుస్థితి నెలకొంది. కాలుష్య నియంత్రణకు అధికారయంత్రాంగం సరిగ్గా పనిచేయడం లేదని ఇప్పటికే మానవ హక్కుల కమిషన్‌ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎవరిచావు వారు చావాలన్న చందంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ, కేందప్రభుత్వం సహా ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా రాష్టాల్రకు నోటీసులు పంపింది. గతంలో లండన్‌ అనుభవించిన నరకం ఇప్పుడు ఢిల్లీని బాధిస్తోందని, తాత్కాలిక ఉపశమన మార్గాలు కాకుండా, శాశ్వత పరిష్కారం ఆలోచించాలని సూచించింది. అలాగే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేయాలని, డీజిల్‌ సాయంతో నడిచే భారీ వాహనాల ప్రవేశంపై నిషేధం, పరిశ్రమల్లో కార్యకలాపాలు ఆపేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ మార్గదర్శకాలు ఇచ్చిన విషయం విధితమే.

Other News

Comments are closed.