కాశ్మీర్‌లో ఉగ్రమూకలను చెండాడాల్సిందే

share on facebook

కాశ్మీర్‌లో సమస్యలపై చర్చించి ఉగ్రమూకలను చెండాడేందుకు కఠిన చర్యలకు ఉపక్రమించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక ఎంతమాత్రం అక్కడ ఉగ్రమూకలకు తావులేకుండా చేయడమెలా అన్నదే ఆలోచన చేయాలి. ముగ్గురు పోలీసులను మట్టుబెట్టున ఉగ్రవాదులు, పోలీసులను రాజీనామా చేయాలని ఒత్తిడి తీసుకుని వస్తున్న తరుణంలో కాశ్మీర్‌ రక్షణకు కఠిన చర్యలు అవసరం. పాక్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ వైపు స్నేహహస్తం చాస్తూనే మరోవైపు ఉగ్రమూకలకు అండగా నిలవడం దారుణం కాక మరోటి కాదు. అందుకు ప్రతిగా భారత్‌ ఇరుదేశాల మధ్య త్వరలో జరపాలనుకున్న విదేశాంగ మంత్రుల చర్చలను రద్దు చేసుకోవడం మంచిదే. వచ్చేవారం న్యూయార్క్‌లో భారత్‌, పాక్‌ విదేశాంగ మంత్రుల సమావేశం తమకు సమ్మతమేనని ప్రకటించిన భారత ప్రభుత్వం 24 గంటల్లోనే తన వైఖరిని మార్చుకుని పాక్‌తో ఎలాంటి సమావేశం వుండదని తేల్చి చెప్పింది. జమ్మూ కాశ్మీర్‌లోని ముగ్గురు పోలీసుల కిడ్నాపు, హత్య, ఇటీవల పాకిస్తాన్‌ మద్దతిచ్చిన ఉగ్రవాది బుర్హాన్‌ వని పేరుతో 20 పోస్టల్‌ స్టాంపులను విడుదల ఈ రెండు పరిణామాలు భారత్‌ను తీవ్రంగా కలవరపరిచాయి. ఉగ్రవాదం, కాశ్మీర్‌ సమస్యతో సహా అన్ని అంశాలపై చర్చించేందుకు ద్వైపాక్షిక చర్చలను పునరుద్ధరించాలని కోరుతూ ఈ నెల 14న పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ రాసిన లేఖకు స్పందనగా వచ్చే వారం న్యూయార్క్‌లో ఇరు దేశాల విదేశాంగమంత్రులు సుష్మ స్వరాజ్‌, మహ్మద్‌ ఖురేషి సమావేశమవుతారని భారత్‌ గురువారం ప్రకటించింది. అయితే తాజాగా చోటుచేసుకున్న ఈ రెండు పరిణామాలు పాకిస్తాన్‌ తీరులో ఎలాంటి మార్పు లేదని తేలిపోయిందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఇటువంటి వాతావరణంలో ద్వైపాక్షిక సంభాషణలకు అర్థంలేదన్నారు. నిజానికి పాక్‌కు బుద్ది చెప్పడం,కాశ్మీర్‌ను దారికి తెచ్చుకునే క్రమంలో అక్కడ ఉగ్రమూకలను చీల్చి చెండాడాలి. అక్కడ తిష్టవేసిన విదేశీ శక్తులను, విదేవీ శక్తులకు మద్దతుగా నిలుస్తున్న శక్తులను ఏరివేయాలి. ఎల్‌టిటిఇని తుదముట్టించడంలో శ్రీలంక అనుసరించిన సైనిక చర్యను మనమూ అసుసరించాలి. పోలీసు సిబ్బంది, వారి కుటుంబాలను ఇలా అపహరించడం, హతమార్చడం వంటి సంఘటనలు పెరుగుతున్నాయంటే ఇంకా ఉపేక్షిస్తూ కూర్చోరాదు. కశ్మీర్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను వేర్పాటువాదులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు. ఈ హత్యలతో మరోమారు కాశ్మీర్‌లో అసలు జరుగుతన్నదేమిటో ప్రపంచానికి తెలిసింది. అక్కడ 370 ఆర్టికల్‌ను అడ్డం పెట్టుకుని హురియత్‌ నేతలు పాక్‌తో కలసి దేశ విద్రోహ చర్యలకు పాల్పడుతూ వచ్చారు. ప్రజలను రెచ్చగొడుతూ యువతను పక్కదారి పట్టిస్తున్నారు. కాశ్మీర్‌ అంశలో హురియత్‌తో చర్చించాలనుకుంటున్న విపక్షనేతలు కాశ్మీర్‌ పండిట్లతో కూడా చర్చించాలి. ముందుగా వారిని తమ స్వస్థలాలకు పంపి రక్షణ కల్పించాలి. హురియత్‌ నేతలు ఒక్కరే కాశ్మీర్‌ ప్రజలు కాదని గుర్తుంచుకోవాలి. వారంతా కావాలని పాక్‌ కొమ్ముకాస్తూ భారత్‌లో వేర్పాటువాద కార్యకలాపాలకు మద్దతు పలుకుతున్నారు. మొత్తంగా దీనిని బట్టి 370 ఆర్టికల్‌ కాశ్మీర్‌ అభివృద్దికి అడ్డుగా నిలవడమే గాకుండా కాశ్మీరీ పండింట్లకు చోటులేకుండా చేసింది. ముందు పండిట్లను కాశ్మీర్‌లో స్వేఛ్చగా జీవించే చర్యలు తీసుకోవాలి. అలా చేస్తేనే కాశ్మీర్‌ అందరిదన్న భావన ఉంటుంది. దేశంలో కాశ్మీర్‌ అంతర్భాగం అన్న విసయం ఇంక చార్చకు రావడం దారుణం. జెపి మెతక వైఖరి సరికాదని కేంద్రం గుర్తించాలి. కాశ్మీర్‌లో అధికారాన్ని బిజెపి పంచుకోగలిగినా అక్కడి సమస్యలను మాత్రం అణచలేకపోతోంది. ఏదో ఒక సమస్య తీసుకుని అక్కడ ఆందోళనలకు పాక్‌ ఆజ్యం పోస్తోంది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు మరీ

ఎక్కువయ్యాయి. ఎన్‌కౌంటర్లు జరిగినా బంద్‌ చేస్తారు. ఆందోళనకు దిగుతారు. క్రికెట్‌లో భారత్‌ ఓడిపోతే సంబరాలు చేసుకుంటారు. అక్కడి హిందువులపై దాడులకు తెగబడతారు. కాశ్మీరీ పండిట్లను జాడ లేకుండా తరిమేశారు. అయినా కేంద్రం ఏనాడూ అక్కడ నివారణ చర్యలు తీసుకుని అక్కడి ప్రజలను భారత్‌తో మమేకం చేయలేకపోయింది. రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి విషయాల్లో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. అధికారంలో ఉన్న బిజెపి కఠినంగా వ్యవహరించి సమస్యను పరిష్కరించడంలో విఫలం అవుతోంది. పాక్‌ పాలకులతో స్నేహం పెంచుకోవడం ద్వారా తీవ్రవాద గ్రూపులు కాశ్మీర్‌ను నిత్యం కల్లోల క్షేత్రంగా రగిలిస్తూనే ఉన్నారు. అందువల్ల ముందుగా కాశ్మీర్‌ నుంచి తరిమివేయబడ్డ పండిట్లను ఇతర ప్రాంత ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాలి. అలా చికిత్సకు శ్రీకాం చుట్టాలి. అప్పుడే మిగతా వర్గాల ప్రజలు కూడా విశ్వాసంలోకి తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం కొంత కఠిన వైఖరినే కేంద్రం అవలంబించాలి. అవసరమైతే సైనిక చర్య ద్వారా ఉగ్రవాదులను ఏరేయాలి. అధికారంలోకి వచ్చిన తరవాత బిజెపి తీసుకున్న నిర్ణయాలేవీ కాశ్మీర్‌ను స్వాంతనపర్చలేదు. కాశ్మీర్‌ విషయంలో గత పాలకులు ముందునుంచి చేస్తూ వచ్చిన తప్పులనే ఇప్పుడు బిజెపి కూడా చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. దేశంలోని విపక్షాలు కూడా బిజెపి ప్రభుత్వాన్ని తప్పు పట్టడం మాత్రమే తమ ఎజెండాగా పెట్టుకున్నారు. కాశ్మీరీ లోయలో ఇప్పుడు మళ్ళీ భారత వ్యతిరేకత ప్రబలిపోతోంది. కాంగ్రెస్‌ కంటే భిన్నమైన వారమని, దేశానికి ప్రత్యామ్నాయమూ తామేనని చెప్పి అధికారంలోకొచ్చిన నరేంద్ర మోడీ సర్కారు సైతం పాత ప్రభుత్వాల ధోరణినే కొనసాగిస్తోంది. దీనినుంచి బయటపడి కొరడా ఝళిపించాల్సిన సమయం ఆసన్నమైంది.

Other News

Comments are closed.