కూకట్‌పల్లి తెరపై కొత్త పేరు

share on facebook

 

నందమూరి హరికృష్ణ తనయ సుహాసిని రంగ ప్రవేశం

బరిలో దింపాలని టిడిపి అధినేత చంద్రబాబు నిర్ణయం

హైదరాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతందో తెలియదు. ఎవరు తెరపైకి వస్తారో..ఎవరు కనుమరుగవుతారా కూడా చెప్పలేం. ఇప్పుడు అదే జరగుతోంది. కూకట్‌పల్లి అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఇంతకాలం పెద్దిరెడ్డి పేరు ఖరారు కాగా ఆయన ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అయితే ఉన్నట్లుండి సైలెంట్‌గా ఆయనను ప్రచారం నుంచి తప్పించేశారు. దీంతో నందమూరి సుహాసిని దాదాపుగా ఖరారైందని అంటున్నారు. సీఎం చంద్రబాబును ఆమె విశాఖలో కలిశారు. కూకట్‌పల్లి టికెట్‌పై ఆమె చంద్రబాబుతో చర్చించారు. సుహాసినికే కూకట్‌పల్లి టికెట్‌ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కూకట్‌పల్లికి చెందిన స్థానిక నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోంది. మహాకూటమిలో భాగంగా కూకట్‌పల్లి స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. అయితే టీడీపీ నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కూకట్‌పల్లి కార్పొరేటర్‌ మందాడి శ్రీనివాస్‌ ఆఖరి నిమిషం వరకు ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ సుహాసినికే టికెట్‌ ఇవ్వాలని చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది. కూకట్‌పల్లి టికెట్‌ ఆశించిన వారితో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఎన్టీఆర్‌ కుటుంబానికి టికెట్‌ ఇస్తుండటంతో అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరనున్నారు. హరికృష్ణ మృతి తర్వాత ఎన్టీఆర్‌ కుటుంబం నుంచి ఒకరికి అవకాశం కల్పించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ తర్వాత తెలంగాణ ప్రాంతం నుంచి పోటీ చేసే రెండో అభ్యర్థి సుహాసిని కావడం గమనార్హం. మొదటగా హరికృష్ణ కుమారుడు కళ్యాణ్‌రాంను కూకట్‌పల్లి నుంచి పోటీకి దింపాలని టీడీపీ భావించింది. ఆయన ఆసక్తి కనబర్చకపోవడంతో సుహాసినిని రంగంలోకి దింపాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కూకట్‌పల్లి నియోజవర్గంలో అత్యధికంగా సెటిలర్స్‌ ఉన్నారు. ఇక్కడ వీరి ఓట్లే కీలకం. సెటిలర్లు ఏ పార్టీపై మొగ్గుచూపుతారో ఆపార్టీకి విజయావకాశాలు ఎక్కువ. అంతేకాకుండా ఎన్టీఆర్‌ అభిమానులు కూడా ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉన్నారు. అందువల్ల సుహాసిని విజయం నల్లేరు విూద నడక అవుతుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

ఈ మేరకు విశాఖ నోవాటెల్‌లో సుహాసిని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబును కలిశారు. కూకట్‌పల్లి నేతలతో సమావేశం అనంతరం వారితో చర్చించి కూకట్‌పల్లి తెదేపా అభ్యర్థిగా సుహాసిని పేరును ఖరారు చేసే అవకాశం ఉంది.

 

 

Other News

Comments are closed.