కృష్ణమ్మ దూకుడు

share on facebook

– నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద
– నేడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
– లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్న అధికారులు
నల్గొండ, ఆగస్టు31(జ‌నం సాక్షి) : నాగార్జున సాగర్‌ జలాశయానికి జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ జలాశయానికి లక్ష క్యూసెక్కులకుపైగా వరద నీరు వస్తోంది. శనివారం సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు నీరు చేరుకునే అవకాశం ఉంది. దీంతో శుక్రవారం సాగర్‌ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. సాగర్‌ గేట్లు ఎత్తనున్న నేపథ్యంలో గుంటూరు, నల్గొండ, కృష్ణా జిల్లాల్లోని పులిచింతల ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. సాగర్‌ దిగువ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
శ్రీశైలంకు భారీగా వరదనీరు..
ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వదర ప్రవాహం భారీగా పెరిగింది. వరద ప్రవాహన్ని బట్టి ఎప్పటికప్పుడు గేట్లు ఎత్తివేసి నీటిని వదలడంతో సాగర్‌లో ప్రస్తుత నీటిమట్టం 582 అడుగులకు చేరింది. రాత్రి వరకు ఇది 585 అడుగులకు చేరే అవకాశం ఉంది. దిగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. అది క్రమంగా పెరుగుతోంది. పైన ఉన్న అల్మట్టి ప్రాజెక్టుకు లక్షా 6వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే.. దిగువకు లక్షా 35వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు లక్షా 35వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉండగా దిగువకు లక్షా 38వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జురాలకు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే, దిగువకు 80వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలానికి వరద ప్రవాహం పెరిగింది.

Other News

Comments are closed.