కెసిఆర్‌కు మింగుడు పడని కర్నాటక రాజకీయాలు

share on facebook

ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలకు విఘాతం కలిగేలా జెడిఎస్‌ నిర్ణయాలు
బిజెపికి అధికారం దక్కితేనే మళ్లీ చర్చలకు అవకాశం
హైదరాబాద్‌,మే16(జ‌నం సాక్షి): ఫెడరల్‌ ఫ్రంట్‌ సన్నాహాల్లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు  కర్ణాటక పరిణామాలు మింగుడు పడని విషయంగా మారాయి. జనతాదళ్‌ కాంగ్రెస్‌ చెట్టాపట్టాల్‌ వేసుకోవడంతో ఇక కర్నాటకలో కెసిఆర్‌ ప్రయత్నాలకు గండి పడిందనే భావించాలి. బెంగాళ్లో కూడా తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్‌ వెంటే నడుస్తోంది. కర్నాటకలో హంగ్‌ ఏర్పడడంతో  ప్రభుత్వం ఏర్పాటుకు జనతాదళ్‌ (సెక్యులర్‌) కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలపడం టీఆర్‌ఎస్‌ పార్టీ షాక్‌ తగిలినట్లయింది. కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు ప్రయత్నించిన నేపథ్యంలో కర్ణాటకలో అధికారం కోసం జేడీ(ఎస్‌) కాంగ్రెస్‌ తో చేతులు కలపడం టీఆర్‌ఎస్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌కు శరాఘాతంగా మారింది. ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్‌ బెంగళూరుకు వెళ్లి మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామిలను కలిసి కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా తాము ఫ్రంట్‌గా ఏర్పడాలని కోరారు. అందుకు వారు సమ్మతించారు. తెలుగువారంతా జెడిఎస్‌కు ఓటేయాలని కెసిఆర్‌ పిలుపునిచ్చారు. కానీ  కర్ణాటక ఫలితాల నేపథ్యంలో బీజేపీయేతర పార్టీలన్ని ఒక్క వేదికపైకి రావాలని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సాధారణ మెజారిటీని మాత్రం చేరుకోలేకపోయింది. 104 స్థానాలు గెలుపొందిన ఆ పార్టీకి షాక్‌ ఇస్తూ.. అనూహ్యంగా కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వం తెరపైకి వచ్చింది. జేడీఎస్‌ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వడం.. ఆ రెండు పార్టీల నేతలు గవర్నర్‌ను కలిసి.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరడంతో కర్ణాటక రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. మరోవైపు మ్యాజిక్‌ ఫిగర్‌కు 9 స్థానాల దూరంలో ఉన్న యడ్యూరప్ప సైతం గవర్నర్‌ను కలిసి తమకు మొదట అవకాశం కల్పించాలని, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలుపుకొని.. మెజారిటీ సభ్యుల మద్దతు తమకు ఉందని  కోరారు. దీంతో గవర్నర్‌ ఎవరికి ముందుగా అవకాశం ఇస్తారు? ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నది ఆకస్తికరంగా మారింది. అయితే గతంలో ఎన్నడూలేనివిధంగా కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ అత్యంతవేగంతో పావులు కదిపింది. ఫలితాలు పూర్తిగా వెలువరించకముందే.. బీజేపీకి అధికారం దక్కకుండా వ్యూహాన్ని ఖరారు చేసి.. వెంటనే అమలు చేసింది. తాము రెండోస్థానంలో ఉన్నప్పటికీ.. మూడోస్థానంలో ఉన్న జేడీఎస్‌కు మద్దతు ప్రకటించి.. జేడీఎస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. కుమారస్వామిని తమవైపు తిప్పుకుంది. కాంగ్రెస్‌ పార్టీ ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడం,వ్యవహారం మారడంతో కెసిఆర్‌కు మింగుడు పడని అంశగానే చూడాలి. ఫలితాలు ఇలా ఉంటాయని ఊహించలేదు.   పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ కూడా సోనియాకు ఫోన్‌చేసి.. చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. గతంలో గోవా తరహాలో ఆలస్యం చేసి.. మరోసారి బీజేపీకి అవకాశం కల్పించవద్దని.. చురుగ్గా, వేగంగా పావులు కదిపి.. బీజేపీని నిలువరించాలని సోనియాకు సూచించినట్టు తెలుస్తోంది.
మొత్తానికి కర్ణాటక ఫలితాలను వేగంగా విశ్లేషించి.. కాంగ్రెస్‌ చురుగ్గా పావులు కదపడం వల్ల ఇప్పుడు.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం ఉన్నప్పటికీ.. కాంగ్రెస్‌లోని ఐదుగురు లింగాయత్‌ ఎమ్మెల్యేలు, జేడీఎస్‌లోని
హెచ్‌డీ రేవణ్ణ వర్గం బీజేపీ తమవైపు తిప్పుకునే అవకాశముందని వార్తలు వస్తుండటం కాంగ్రెస్‌-జేడీఎస్‌లో కలవరం రేపుతోంది. ఒకవేళ అక్కడ బిజెపి ప్రభుత్వం ఏర్పడితేనే మళ్లీ కెసిఆర్‌ ప్రతిపాదనలకు ప్రాణం వస్తుంది.

Other News

Comments are closed.