కేటీఆర్‌ రాజకీయ సన్యాసానికి.. సిద్ధంగా ఉండు

share on facebook

– తెలంగాణలో దొరలపాలన కొనసాగుతోంది
– ప్రజాస్వామ్య విలువలకు కేసీఆర్‌ పాతరేశాడు
– సీఎంవో నుంచి ఎవరికీ అపాయింట్‌ మెంట్‌ ఉండదు
– నాలుగేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్రవ్యతిరేకత ఉంది
– ఓటమి భయంతోనే కేసీఆర్‌ ముందస్తుకెళ్లాడు
– కుమారుడికి పట్టం కట్టబెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి
– హరీష్‌రావుకు అనుకూలంగా ఉన్నవారికి అసమ్మతిని రాజేస్తున్నారు
– పైపుల కంపెనీల నుంచి కవిూషన్‌ల కోసం మిషన్‌ భగీరథ పథకాన్ని తెచ్చారు
– ఎర్రబెల్లికి ఓ న్యాయం.. డిఎస్‌కు ఓ న్యాయమా?
– తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను కేసీఆర్‌ ఏనాడూ పట్టించుకోలేదు
– మహాకూటమిని విమర్శించే కేటీఆర్‌.. బీజేపీతో ఎందుకు అంతర్గత పొత్తు?
– బీసీ మహిళ అయినందువల్లే నాకు మంత్రి పదవి ఇవ్వలేదు
– నాకెందుకు టికెట్‌ ఇవ్వలేదో ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు
– 15 పార్టీల నుంచి మాకు ఆహ్వానాలు వస్తున్నాయి
– నాలుగైదు రోజుల్లో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాం
– విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేత కొండా సురేఖ
హైదరాబాద్‌,సెప్టెంబర్‌25(జ‌నంసాక్షి) : నాలుగేళ్ల తెరాస పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన మంత్రి కేటీఆర్‌.. అందుకు సిద్ధంగా ఉండాలని టీఆర్‌ఎస్‌ తాజా మాజీ ఎమ్మెల్యే, తిరుగుబాటు నేత కొండా సురేఖ అన్నారు.  కెసిఆర్‌ దొరల పాలన సాగిస్తున్నారని అన్నారు. సచివాలయానికి రాకుండా పాలన సాగిస్తున్న ఏకైక సిఎం కెసిఆర్‌ అంటూ తీవ్రస్తాయిలో ధ్వసమెత్తారు.  హైదరాబాద్‌ సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విూడియా సమావేశంలో భర్త కొండా మురళితో కలసి ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ విడుదల చేశారు.తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతోందని కొండా సురేఖ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారికి తెరాసలో సరైన ప్రాధాన్యత లభించడం లేదని ఆక్షేపించారు. ఒక్క మహిళా మంత్రి కూడా లేకుండా ప్రభుత్వాన్ని నడపడంలోనే మహిళలపై కేసీఆర్‌కు ఉన్న గౌరవం ఏంటో తెలుస్తోందన్నారు. తెరాస ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కేంద్రంతో పాటుగా ఎన్నికలు జరిగితే ఓడిపోతామని కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. అందుకే  ముందస్తు ఎన్నికలకు తెరదీశారని సురేఖ అన్నారు. బీసీ మహిళ అయిన తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోయినా పార్టీ కోసం ఎంతో చేశానని.. అయినప్పటికీ తనకు ఎమ్మెల్యే సీటు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తే ఇప్పటి వరకు స్పందించ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం దారుణమన్నారు.  తెరాస ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో నాపేరు లేకపోవడం బాధించిందన్నారు. దీనిపై రెండ్రోజుల్లో నాకు సమాధానం చెప్పాలని అధిష్ఠానాన్ని కోరామని.. పది రోజులైనా వారి నుంచి సమాధానం రాలేదన్నారు. అందుకే కేసీఆర్‌ బహిరంగ లేఖ రాస్తున్నా అని సురేఖ తెలిపారు. కేసీఆర్‌ ఒక్కరోజు కూడా
సచివాలయానికి రాని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచారని కొండా సురఖ విమర్శించారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని హావిూ ఇచ్చిన కేసీఆర్‌.. ఆయన కుటుంబానికి మాత్రం నాలుగు పదవులు ఇచ్చుకున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిని కలవాలంటే సాధారణ ప్రజలకే కాదు ప్రజాప్రతినిధులకూ కష్టమేనని, సీఎం అపాయింట్‌మెంట్‌ కోసం ఎప్పుడు ప్రయత్నించినా నిరాశే ఎదురవుతోందన్నారు. నా తండ్రి చనిపోతే ఓదార్చడానికి రాని కేసీఆర్‌… తెదేపా నుంచి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్‌రావు తండ్రి చనిపోతే మాత్రం వరంగల్‌ వచ్చి పరామర్శించి వెళ్లారని అన్నారు. బీసీ మహిళను కాబట్టే నాపై వివక్ష చూపుతున్నారని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి పదవులు ఇచ్చేందుకు ఆలోచిస్తున్న కేసీఆర్‌.. తనకు మందుబిళ్లలు సమయానికి ఇచ్చేందుకు నియమించుకున్న వ్యక్తిని మాత్రం ఏకంగా రాజ్యసభకు పంపారని విమర్శించారు. బంగారు తెలంగాణ అర్థం ఇదేనా అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. రైతుబంధు పథకంతో ధనిక రైతులకు తప్ప పేద రైతులకు ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదని, తెలంగాణ వచ్చిన తర్వాత సోనియాగాంధీని కలిసి కాళ్లు మొక్కిన కేసీఆర్‌.. ఇప్పుడు ఆమె దెయ్యమంటూ అవహేళన చేయడం దారుణమన్నారు. నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని హావిూ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రపతి ¬దాలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రణబ్‌ముఖర్జీ కాళ్లు మొక్కిన కేసీఆర్‌… ఇప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను మాత్రం పట్టించుకోలేదని.. దళితుడైనందు వల్లే ఆయన్ని కేసీఆర్‌ అవమానించారని అన్నారు.
కేటీఆర్‌ను సీఎం పీఠం ఎక్కించేందుకు ప్రయత్నాలు..
తన వారసుడైన కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేందుకు కేసీఆర్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని, అందుకే హరీశ్‌రావు నమ్మకస్తులకు టిక్కెట్లు కేటాయించలేదని కొండా సురేఖ విమర్శించారు. ఎన్నికల సమయంలో అమెరికా నుంచి వచ్చిన కవిత నెలరోజులు ఉండి వెళ్లిపోతానని చెప్పి వ్యాపారిగా మారిందన్నారు. లష్కర్‌ బోనాల్లో కవిత ఏ ప్రొటోకాల్‌ ప్రకారం బంగారు బోనం ఎత్తుకుందని కొండా సురేఖ ప్రశ్నించారు. అదేనా బంగారు తెలంగాణ అంటే అంటూ ప్రశ్నించారు. నయీం కేసు ఏమైందో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు అల్లుడు కాంగ్రెస్‌లో ఉంటే తప్పలేదు గానీ.. డీఎస్‌ కుమారుడు భాజపాలో చేరితే విమర్శిస్తారా?. ఎర్రబెల్లికి ఓ న్యాయం.. డీఎస్‌కు ఓ న్యాయమా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తెరాస అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించిన కేటీఆర్‌ అందుకు సిద్దం కావాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో మహాకూటమి చేతిలో తెరాస ఓటమి ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. మా కుటుంబానికి చేసిన నమ్మకద్రోహాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకే విూడియా ముందుకు వచ్చామని సురేఖ తెలిపారు. పార్టీలో హరీశ్‌రావుకు కూడా అన్యాయం జరుగుతోందని, అందుకే ఇటీవల ఆయన రాజకీయాలను నుంచి తప్పుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారన్నారు. కోదండరాంను ఉద్యమ సమయంలో బంగారు కొండ అని అన్నారని కానీ ఇప్పుడు తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కోదండరాంను అనరాని మాటలు టీఆర్‌ఎస్‌ నేతలు, కేసీఆర్‌ అంటున్నారని విమర్శించారు. ఓ సర్పంచ్‌గా కూడా గెలవలేని వాడు అంటూ కోదండరాంను అంటుంటే తెలంగాణ ఉద్యమకారులు బాధపడుతున్నారని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యతకోసం కేసీఆర్‌ ఏనాడూ ప్రయత్నించలేదని, చంద్రబాబుతో వ్యక్తిగత వైరం పెట్టుకొని రెండు రాష్ట్రాల మధ్య కేసీఆర్‌ ఆగాధాన్ని మరింత పెంచుతున్నారని అన్నారు. నాకు చాలాపార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని, అయితే తెరాస అధిష్ఠానం మాపై ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూసిన తర్వాతే మా
భవిష్యత్‌ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. మాకు ఇప్పటికే 15 పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయని, కీలక బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారని అన్నారు. నాలుగైదు రోజుల వరకు కేసీఆర్‌ సమాధానం కోసం వేచి చూస్తామని, ఆతరువాత మా భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుందని సురేఖ స్పష్టం చేశారు.

Other News

Comments are closed.