కేర్‌టేకర్‌ అన్న పదం రాజ్యంగంలో లేదు

share on facebook

ప్రభుత్వం అంటే ప్రభుత్వమే
అభ్యర్థులను ప్రకటించి రాజకీయ పార్టీలకు సవాల్‌
సిట్టింగ్‌లందరికి సీట్ల కేటాయింపుతో అందరిలో భరోసా
ఇద్దరికి మాత్రం నిరాకరణ
చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న ఎంపి బాల్క సుమన్‌
బాబూ మోహన్‌ స్థానంలో జర్నలిస్ట్‌ క్రాంతి కిరణ్‌
కెసిఆర్‌ అభ్యర్థుల ప్రకటనతో వేడెక్కిన రాజకీయం
హైదరాబాద్‌,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి):  తెలంగాణ ప్రభుత్వం రద్దుకు గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదం తెలిపాక  తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలి ఆమోదించిన తీర్మానాన్ని కేసీఆర్‌ గవర్నర్‌ను కలిసి సమర్పించారు. ఈ తీర్మానానికి ఆమోదముద్ర వేసిన గవర్నర్‌.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగించాలని కేసీఆర్‌ను కోరారు. గవర్నర్‌ సూచనను సమ్మతించిన కేసీఆర్‌.. ఆపద్ధర్మ సీఎంగా కొనసాగేందుకు అంగీకరించారు. కేసీఆర్‌తో పాటు మంత్రివర్గ సభ్యులందరూ ఆపద్ధర్మంగా కొనసాగనున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం రద్దయిన ఆరు నెలల్లోపు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే రాజ్యాంగంలో ఎక్కడా ఆపద్దర్మ ప్రభుత్వం అన్నది లేదని సిఎం కెసిఆర్‌ విూడియా సమావేశంలో అన్నారు. ప్రభుత్వం అన్నది ఉంటుందని దానికి కేర్‌ టేకర్‌ అన్నది లేదన్నారు. దీంతో తాను పూర్తిస్థాయి సిఎం అన్న భావనను వ్యక్తం చేశారు. దీనికితోడు వెంటనే 105 స్థానాల్లో టిక్కెట్లను ప్రకటించి సంచనలం సృష్టించారు. సెప్టెంబర్‌లో అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పినా హుస్నాబాద్‌ సభలో కొన్ని ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ ముందే అభ్యర్థులను ప్రకటించి అందరిని ఆశ్చర్యంలోకి నెట్టారు. ఇకపోతే ఇద్దరు సిట్టింగ్‌లకు టిక్కెట్లు నిరాకరించారు. అందులో ఆందోల్‌ నుంచి బాబు మోహన్‌, మంచిర్యాల నుంచి దుర్గం చిన్నయ్యలకు టిక్కెట్లు నిరాకరించారు. ఆందోల్‌లో జర్నలిస్ట్‌ క్రాంతికిరణ్‌కు టిక్కెట్‌ కేటాయించారు. అలాగే సత్తుపల్లిలో విద్యార్తి ఉద్యమ నేత పిడమర్తి రవికి టిక్కెట్‌ కేటాయించారు. ఇకపోతే టిక్కెట్ల కేటాయింపుతో  తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలయింది. రాజకీయ చాణక్యుడిగా పేరొందిన సీఎం కేసీఆర్‌ సరికొత్త వ్యూహంతో ముందస్తు ఎన్నికలకు వెళుతుండడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఏప్రిల్‌ లేదా మే లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, కేసీఆర్‌ ఎన్నికల క్షేత్రానికి ముందే వెళుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలమైన ప్రతిపక్షంగా ఉంది. ఆ పార్టీ ఎన్నికలకు ఇప్పటికీ సిద్ధం కాలేదు. తెలంగాణ రాష్ట్ర సమితిలో దాదాపు సిట్టింగ్‌ సభ్యులకు స్థానాలు ఇస్తామని కేసీఆర్‌ ఇది వరకే ప్రకటించారు. కాంగ్రెస్‌ శ్రేణులు ఇంకా సీట్ల కేటాయింపులపై దృష్టి పెట్టలేదు. ఇటీవలే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో సభలు నిర్వహించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కదలిక మొదలయింది. 2014 ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్‌ తర్వాత తెలుగుదేశం మూడోస్థానంలో నిలిచింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం బలహీనపడింది. ఒక వేళ కాంగ్రెస్‌, తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, వామపక్షాలు  మహాకూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు దిగితే ఫలితాలు తారుమారయ్యే అవకాశాల ఉన్నాయా అన్న విశ్లేషణ చేసిన తరవాత ముందే అందుకు చెక్‌ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు అర్థం అవుతోంది. ఈ కూటమి ఏర్పాటు చేయాలంటే
సుదీర్ఘమైన చర్చలు, రాజకీయ పక్రియ అవసరం. ప్రతిపక్షాలకు ఆ వ్యవధి ఇవ్వకుండా కెసిఆర్‌ రాజకీయ చాణక్యం ప్రదర్శించారు. మరో వైపు భాజపా కూడా తెలంగాణలో బలపడేందుకు శక్తియుక్తులు కూడగట్టడంతో పాటు ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ దశలో తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక పథకాలను ప్రారంభించింది. కల్యాణ లక్ష్మి, రైతులకు ఆర్థికసాయం, బీమా, గొర్రెల పంపిణీ నుంచి తాజాగా కంటి వెలుగు పథకం వరకు పదుల సంఖ్యలో పథకాలను అమలు చేస్తోంది. బడుగు, బలహీన వర్గాలకు ఈ పథకాలు లబ్ది చేకూర్చాయి. జాతీయ స్థాయిలోనూ వీటి అమలుపై పలు రాష్ట్రాలు  ఆసక్తిగా గమనించాయి. ప్రత్యేకించి డబుల్‌ బెడ్‌ రూం పథకం సూపర్‌హిట్‌గా నిలిచింది. వీటితో పాటు ప్రతి ఇంటికి నీరు అందించే మిషన్‌ భగీరథ పనులు పూర్తికానున్నాయి. కాళేశ్వరం పథకం జాతీయస్థాయిలో ఇంజినీరింగ్‌ అద్భుతంగా మారనుంది. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడటంతో అన్ని ప్రాజెక్టులు నిండాయి. సానుకూల వాతావరణంతో పాటు తెలంగాణ ఏర్పడిన అనంతరం ఆర్థికంగా మిగులు రాష్ట్రంగా నిలిచింది. లక్షలాది ఆంధ్రా కుటుంబాలు హైదరాబాద్‌లో స్థిరపడ్డాయి. వారు కూడా టిఆర్‌ఎస్‌ పట్ల సానుకూలంగా ఉన్నారు. నగరంలో శాంతి భద్రతల పరిస్థితి గతంలో ఎన్నడూ లేని రీతిలో మెరుగ్గా ఉంది. పోలీసింగ్‌ మంచి ఫలితాలు ఇస్తుండటంతో రాష్ట్రంలో పెట్టుబడుల పెట్టేవారి సంఖ్య పెరిగింది.
వాస్తవానికి 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి ఒకే సారి ఎన్నికలు జరిగితే జాతీయ అంశాల ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ముందస్తుగానే అసెంబ్లీకి ఎన్నికలు జరగాలని కేసీఆర్‌ భావించారని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. రాజకీయ వాతావరణం తెరాసకు సానుకూలంగా ఉందని గుర్తించిన సమయంలోనే ఎన్నికలు జరపడం ద్వారా మరో ఐదేళ్లు అధికారం సాధించాలన్న వ్యూహంతోనే కెసిఆర్‌ ముందస్తుకు సిద్దం అయ్యారు. నవంబర్‌లో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే తెరాసకు ఫలితాలు సానుకూలంగా ఉండవచ్చు. ఎన్నికలకు కూడా త్వరగా జరుగుతాయని కెసిఆర్‌ అందుకే సంకేతాలు ఇచ్చారు.

Other News

Comments are closed.