కేసీఆర్‌వి ఉత్తి హామీలు

share on facebook

– అబద్ధపు ప్రచారాలు

– టీపీసీసీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

వరంగల్‌,సెప్టెంబర్‌ 23,(జనంసాక్షి): తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి మండలం భీమారంలో జరిగిన ఇందిరమ్మ రైతు బాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్‌ సర్కారు అబద్ధపు ప్రచారాలతో మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. రాజకీయ దురుద్దేశంతోనే జీవో 39ను తీసుకొచ్చారని అన్నారు. ఎక్కడికక్కడ రైతు సంరక్షణ సమితులను ఏర్పాటు చేసుకుని రైతు సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.పనిచేసే ప్రతి రైతుకూ రూ.4వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బతుకమ్మ పండగకు నాసిరకం చీరలు ఇచ్చి మహిళలను అవమానించారని దుయ్యబట్టారు. తక్షణమే రూ.500లతో నాణ్యమైన చీరలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇది పూర్తిగా నాసిరకం ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నాసిరకం పనులు వల్ల 8 మంది మృత్యువాత పడ్డారని విమర్శించారు.రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ‘ఇందిరమ్మ రైతుబాట’ పూర్తిగా విజయవంతం అయ్యిందని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కుంతియా అన్నారు. కేసీఆర్‌ సర్కారుపై రాజీలేని పోరాటం చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హావిూని కేసీఆర్‌ నిలబెట్టుకోలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ అన్నారు. ఏది విమర్శించినా కాంగ్రెస్‌ కుట్ర అనడం అలవాటుగా మారిందని ఆక్షేపించారు. కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీలను కట్టి ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు భట్టి విక్రమార్క, కె. రాజు, మల్లు రవి, బలరాం నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.