కేసీఆర్‌ అడుగు జాడ!

share on facebook

 

 

తెలంగాణ ఉద్యమంలో అధినేతకు వెన్నుదన్ను

ప్రత్యక్ష రాజకీయాల్లోకి సంతోష్‌

వచ్చే ఎన్నికల్లో వేములవాడ భరిలో?

హైదరాబాద్‌,అక్టోబర్‌ 25,(జనంసాక్షి):తెలంగాణ ఉద్యమ సేనానికి ఆయన అడుగుజాడ. ప్రత్యేక రాష్ట్ర పోరు వెళ్లువెత్తుతోన్న వేళ ఆయన అలుపెరుగని శ్రామికుడు. ఉద్యమ అవసరాలు.. పార్టీ పనులు.. అధినేత వ్యవహారాలు ఒంటి చేత్తో చక్కబెట్టిన సమర్థుడు. ఎలాంటి పనినైనా సులువుగా చేసిపెట్టగల నేర్పరి. ఇన్ని మంచి గుణాలు ఉన్నా.. ఆయన ఇన్నాళ్లు తెరచాటు నాయకుడే. ప్రత్యక్ష రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నా ఏనాడూ తనకంటూ గుర్తింపును కోరుకోలేదు. అలాంటి అడుగు జాడ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయ చిత్రపటంపై అరంగేట్రం చేస్తోంది. టీఆర్‌ఎస్‌ పార్టీలో కీలక పదవితో ఆరంభమైన ప్రస్థానం 2019 ఎన్నికల్లో వేములవాడ క్షేత్రం నుంచి చట్టసభవైపునకూ అడుగులు వేస్తోంది. ఆయనే టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్‌కుమార్‌.

 

తెలంగాణ గుండెచప్పుడు టీ న్యూస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యక్తిగత కార్యదర్శిగా జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ సుపరిచితులే. కేసీఆర్‌తో, టీఆర్‌ఎస్‌తో సంబంధాలున్న వారికి తప్ప బాహ్య ప్రపంచానికి ఆయన పెద్దగా పరిచయం లేరు. 2001లో టీఆర్‌ఎస్‌ పురుడు పోసుకున్నది మొదలు సంతోష్‌ అధినేత కేసీఆర్‌ వెన్నంటే నడిచారు. పార్టీ ఉత్తానపతనాల్లోనూ ఆయన కేసీఆర్‌ నీడలాగే ఉన్నారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నాడు పిడికెడు మంది ఆరంభమైన ఉద్యమంలో సంతోష్‌ పాత్రధారి. కేసీఆర్‌, ఆచార్య జయశంకర్‌ వెన్నంటే ఉంటూ టీఆర్‌ఎస్‌ ప్రతి పరిణామంలోనూ తనదైన పాత్ర పోషించారు.

 

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన సంతోష్‌ స్వయానా కేసీఆర్‌ తోడల్లుడి కుమారుడు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్నా.. కేసీఆర్‌ వెన్నంటే నడుస్తున్నా… ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులు వేయలేదు. ఉద్యమ అవసరాల రీత్యా ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు ప్రయాణాలు సాగించారు సంతోష్‌. టీ న్యూస్‌ నిర్వహణలో కేసీఆర్‌, కేటీఆర్‌తో కలిసి పనిచేశారు. ఉద్యమంలో కేసీఆర్‌, కేటీఆర్‌ బిజీ అయిపోయిన తర్వాత పూర్తిస్థాయిలో టీ న్యూస్‌ నిర్వహణ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. కేసీఆర్‌ కరీంనగర్‌లో పోటీ చేసినా.. ఉప ఎన్నికలకు వెళ్లినా.. మహబూబ్‌నగర్‌ వెళ్లినా.. గజ్వేల్‌ వెళ్లిన అక్కడ సంతోష్‌ ప్రజెన్స్‌ మస్ట్‌. ఊపిరి సలపనంత పని ఉన్న చిరునవ్వుతో ఫ్రెష్‌గా కనిపించడం సంతోష్‌ స్టయిల్‌.

 

పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ ఏర్పాటు వరకూ ఎన్నో ఆటుపోట్లను చవిచూసినా ఏనాడు వెన్నుచూపలేదు. 2009 ఎన్నికల్లో మహాకూటమిగా జట్టుకట్టి 10 అసెంబ్లీ సీట్లకే పరిమితమైన వేళ కేసీఆర్‌తో కలిసే పనిచేశారు. కేసీఆర్‌ ఆమరణ దీక్ష, కేంద్రం ప్రకటన, సీమాంధ్రుల కుట్రలతో చేసిన ప్రకటన నుంచి కేంద్రం వెనక్కి వెళ్లిన వేళ మళ్లీ ఉద్యమ వ్యూహ రచన.. తెలంగాణ ఇవ్వక తప్పని అనివార్యత.. ఇలా ప్రతి ఉద్యమ పరిణామంలో రాముడికి హనుమంతుడిలా వెన్నంటి నిలిచాడు సంతోష్‌. ఉద్యమంలో తర్వాత వచ్చిన వాళ్లు ముందు వరుసలోకి వెళ్లిపోయినా ఏనాడు నిరుత్సాహ పడలేదు. కేసీఆర్‌ ఇచ్చిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ తన పని తాను చేసుకుపోయారు.

 

ఇటీవల ప్రకటించిన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యకవర్గంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు సీఎం కేసీఆర్‌. తద్వారా పార్టీలో సంతోష్‌కు కీలక ¬దా కట్టబెట్టారు. రాబోయే ఎన్నికలకు పార్టీ సమాయత్తం చేయడంతో పాటు లోటుపాట్లను కనుగొనడం.. అధినేత దృష్టికి తీసుకెళ్లి వాటికి పరిష్కారం చూపడం ఇప్పుడు సంతోష్‌ ముందున్న సవాళ్లు. అదే సమయంలో తన సొంత నియోజకవర్గం వేములవాడపై దృష్టి సారించాల్సిన కీలక తరుణం. చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వ పంచాయితీతో వేములవాడ స్థానం కొన్నేళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. న్యాయస్థానాల్లో చెన్నమనేని పౌరసత్వంపై ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇలాంటి తరుణంలో వాటికి చెక్‌ పెట్టే యోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నట్టు సమాచారం. ఆ నియోజకవర్గం తమ కుటుంబానికే చెందిన సంతోష్‌ను భరిలో నిలిపితే విజయం నల్లేరుపై నడకే. ఈ నేపథ్యంలోనే సంతోష్‌ను వేములవాడ నుంచి పోటీకి నిలుపుతామనే సంకేతాలు ఇచ్చారు సీఎం కేసీఆర్‌. ఇన్నాళ్లు తన వెన్నంటే ఉండి తలలో నాలుకలా వ్యవహరించిన సంతోష్‌ ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గానికి సమర్థ సేవలందిస్తారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.

 

 

 

 

Other News

Comments are closed.