కొడంగల్‌లో ప్రశాంతంగా ఓటింగ్‌

share on facebook

కోస్గిలో అర్థరాత్రి అలజడి
కొడంగల్‌,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించు కోవటానికి భారీగా పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యువ ఓటర్లు సైతం అధిక సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుంటున్నారు. తెరాస అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డి… కొడంగల్‌ పట్టణంలోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో పర్యటించి.. పోలింగ్‌ సరళిని పరిశీలించారు. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకోవటానికి పెద్ద ఎత్తున ఓటర్లు తరలివస్తున్నారని, గతంలో కంటే అధిక సంఖ్యలో ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని అన్నారు. ఉపాధి కోసం ముంబయి, బెంగళూరు పట్టణాలకు వెళ్లిన వారు సైతం అధిక సంఖ్యలో వచ్చి ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే  కోస్గిలో గురువారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వాహనాల్లో తెరాస నేతలు లాఠీలు, మద్యం తరలిస్తుండగా కాంగ్రెస్‌ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కోస్గి పక్కనే ఉన్న బాహర్‌ పేట కాలనీలో తెరాస అభ్యర్థి నరేందర్‌ రెడ్డి తన వాహనంతో పాటు మరో నాలుగు వాహనాల్లో చేరుకున్నారు. అందులోని ఓ వాహనంలో లాఠీలు, మద్యం ఉన్నాయంటూ కాంగ్రెస్‌ నాయకులు అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వాహనాలను తనిఖీ చేయగా.. ఓ వాహనంలో లాఠీలు బయటడ్డాయి. దీంతో అన్ని వాహనాలను తనిఖీ చేయాలంటూ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో పాటు, ఇతర నాయకులు ఆందోళన చేపట్టారు. రెండు గంటల పాటు ఈ ఉద్రిక్తత కొనసాగగా ఎస్పీ రెమా రాజేశ్వరి ఇరు వర్గాలను శాంతింప జేశారు. కర్రలు దొరికిన వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Other News

Comments are closed.