కొత్త జిల్లాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

share on facebook

5

– మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): అధికారిక నివాసంలో సీఎం కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్‌ సవిూక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు..ప్రజలకు పరిపాలన మరింత చేరువయ్యేందుకే జిల్లాల పునర్వ్యవస్థీకరణ అని తెలిపారు.కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి టాస్క్‌ఫోర్స్‌కు సూచించాలని ప్రజాప్రతినిధులకు నిర్దేశించారు. మండల కేంద్రానికి దగ్గరగా ఉన్న గ్రామాలు వేరే మండలంలో ఉంటే..అక్కడి ప్రజల అభిప్రాయాలు తీసుకుని మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు కూడా రాజకీయ కారణాలతో కాకుండా ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఆలోచించాలని సూచనలు చేశారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉండాలనే ప్రతిపాదన లేదని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గం కచ్చితంగా ఒకే జిల్లాలో ఉంటుందని చెప్పలేమని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికే 10 రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు..ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో విస్తరించాయని వెల్లడించారు.మహబూబ్‌నగర్‌ జిల్లాకు స్వర్ణయుగం రాబోతుందన్నారు. శరవేగంగా పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని..నీటి పారుదల రంగంలో పాలమూరు జిల్లా గోదావరి జిల్లాల సరసన నిలుస్తదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. వలసలు పోయిన వారంతా తిరిగి పాలమూరుకు చేరుకునే రోజులు వస్తున్నాయని పేర్కొన్నారు. పాలమూరు జిల్లా అంతా నీటి సౌకర్యం వస్తున్నందున రైతులెవరూ భూములను అమ్ముకోవద్దని కోరారు.కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి విడుదలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని..కృష్ణానది వల్ల ఎక్కువ ప్రయోజనం పాలమూరు జిల్లాకే కలుగుతుందన్నారు. పాలమూరు రైతులకు నీళ్లివ్వడం గొప్ప కార్యంగా భావిస్తున్నమని తెలిపారు. పాలమూరు జిల్లాలో ఉన్న అన్ని జాతీయ రహదారులకు ఇరువైపులా విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. తెలంగాణలో అడుగుపెట్టేవారికి పాలమూరు జిల్లా ఆకుపచ్చతోరణాలతో స్వాగతం పలికినట్లుండాలని సూచించారు. హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని సీఎం పునరుద్ఘాటించారు.

Other News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *