కొమురవెల్లికి పెరుగుతున్న భక్తుల సంఖ్య

share on facebook

సిద్దిపేట,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):  ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి క్షేత్రంలో  భక్తుల రద్దీ కొనసాగుతోంది. శివరాత్రి వరకు భక్తుల రాక పెరగనుంది. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాకతో క్షేత్రం జనసందడిగా మారింది.  4వ వారం సందర్భంగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రానున్న రోజుల్లో మరింతగా భక్తుల రాక పెరగగలదని తెలుస్తోంది. స్వామి వారిని దర్శించుకునేందుకు సుమారు 60 వేల మంది భక్తులు కొమురవెల్లికి తరలివచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. స్వామి వారి సన్నిధికి భక్తులు  ఉదయం నుంచే చేరుకున్నారు. అనంతరం ఆలయ నిర్వహణలో ఉన్న గదులతోపాటు ప్రైవేటు గదులను అద్దెకు తీసుకుని బస చేశారు. ఆదివారం వేకువజామునే కోనేటిలో పవిత్రస్నానం ఆచరించి, నేరుగా స్వామి వారి దర్శనం కోసం క్యూలో గంటల తరబడి వేచి ఉండి స్వామి వారిని దర్శించుకున్నారు. కొంతమంది భక్తులు అర్చనలు, ప్రత్యేక పూజలు, కేశఖండన, నజరు, మహామండప, చిలుక పట్నం, బోనం, టెంకాయలు, హుండీల్లో కానుకలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు తమ కోర్కెలు తీర్చాలని గంగరేగు చెట్టు వద్ద ముడుపులు, సంతానం కలగాలని మరికొందరు ఒల్లు బండ పూజలు, రాతిగీరల వద్ద మొక్కులు, కోడెను కట్టివేసి స్వామి వారిని వేడుకున్నారు. భక్తులకు మల్లన్న ఆలయ పాలక మండలి చైర్మన్‌ సెవెల్లి సంపత్‌, డిప్యూటీ కమిషనర్‌ టీ వెంకటేశ్‌, కమిటీ సభ్యులు ముత్యం నర్సింహులు, ఉడుత మల్లేశ్‌యాదవ్‌, జూకంటి కిష్టయ్య, బండి తిరుపతిరెడ్డి, ఆలయ ఏఈవో రావుల సుదర్శన్‌, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు సేవలు అందించారు.

Other News

Comments are closed.