కొలువుల కొట్లాట బరాబర్‌

share on facebook

– తేది మార్పులేదు

– కోదండరాం

హైదరాబాద్‌,అక్టోబర్‌ 28,(జనంసాక్షి):ఈ నెల 31న నిర్వహించ తలపెట్టిన ‘కొలువుల కొట్లాట’ సభను జరిపి తీరుతామని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న దమనకాండపై ఆయన మండిపడ్డారు. ఉమ్మడి పాలనలో ఆంధ్రా పాలకులు కూడా ఇంతగా నిర్బంధం విదించలేదన్నారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ సభకు నిరుద్యోగులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాల కోసమే తెలంగాణ తెచ్చుకున్నామని.. ప్రస్తుతం ఉద్యోగాల కోసమే పోరాడుతున్నామన్నారు. సభకు అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసినా.. జాప్యం చేశారని తెలిపారు. కోర్టు నుంచి సానుకూల తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సభను తప్పకుండా, యథాతథంగా జరిపి తీరుతామని స్పష్టం చేశారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని అడగటం లేదని.. ప్రస్తుతం ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని మాత్రమే కోరుతున్నామని వెల్లడించారు. పౌరులకు ఉద్యోగం, ఉపాధి కల్పన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. పొరుగు సేవల సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే పోలీసులు సభ జరగనీయవద్దనే ఆలోచనలో ఉన్నారని కోదండరాం అన్నారు. సభకు స్థలాలు, ఫంక్షన్‌హాళ్లు ఇవ్వొద్దని యజమానులను బెదిరిస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో సభలు పెడితే ఏం కారణాలు చెప్పారో.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అదే కారణాలు చెబుతోందన్నారు. ఆంధ్రా పాలకుల కంటే దుర్మార్గంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కోదండరాం పేర్కొన్నారు. సభకు కోర్టు అనుమతి ఇస్తుందని ఆశిస్తున్నామని చెప్పిన కోదండరామ్‌.. హైదరాబాద్‌లో ఏ గ్రౌండ్‌ ఇచ్చినా ఓకే అని కోర్టుకు చెప్పామన్నారు. కొలువుల కొట్లాట కరపత్రాలను విడుదల చేసిన జేఏసీ నేతలు.. సభకు నిరుద్యోగులు పెద్దసంఖ్యలో రావాలని కోదండరామ్‌ కోరారు.

రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ నిర్వహించతలపెట్టిన ‘కొలువుల కోసం కొట్లాట’ సభ నిర్వహణ తేదీ విషయమై ఎలాంటి మార్పులు చేయలేదని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. ఈ నెల 31నే సభను నిర్వహిస్తామని చెప్పారు. సభ నిర్వహణ అనుమతిం చాలని దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును హైకోర్టు ఈ నెల 30కి వాయిదా వేసిందని, సభకు అనుమతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Other News

Comments are closed.