కౌలు రైతుకు దక్కని గుర్తింపు

share on facebook

అందని సర్కార్‌ సాయం
ఆదిలాబాద్‌,మే16(జ‌నం సాక్షి): ప్రభుత్వం 2011లో తీసుకొచ్చిన కౌలు రైతు చట్టం అమలులో అబాసుపాలవుతోంది. రైతుల్లో అవగాహన రాహిత్యం, అధికారుల్లో చిత్తశుద్ధి లోపించడంతో పదిశాతం కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డులు దక్కడం లేదు. అన్నదాతను అన్ని విధాలా ఆదుకోవాలని యోచిస్తున్న ప్రభుత్వం వీరి సంక్షేమం కోసం పలు పథకాలను ప్రకవేశపెడుతోంది. ఇప్పటికే లక్ష వరకు వడ్డీలేని రుణం, సేద్య పరికరాలపై రాయితీ, ఉచిత పంటల బీమా, విపత్తు రాయితీ పంటనష్ట పరిహారం, రాయితీపై విత్తనాలు, ఉచితంగా పండ్లమొక్కల పంపిణీ తదితర ప్రయోజనాలను అందిస్తున్నది.  భూములను కౌలుకు తీసుకొని సాగు ఖర్చులన్నీ భరిస్తున్న కౌలురైతుకు మాత్రం మరోమారు అన్యాయం జరిగే పరిస్థితి నెలకొంది. భూమిపై ఎలాంటి హక్కులేక పోయినా సాగుకయ్యే ఖర్చులపై రాయితీలు, సదుపాయాలు, పంటరుణాలు, విపత్తుల సందర్భంగా పంటనష్టం జరిగినపుడు పరిహారం అందుకొనేందుకు కౌలురైతుకు వెసులు బాటు కల్పిస్తూ ప్రభుత్వం 2011లో కౌలు రైతు చట్టాన్ని తీసుకొచ్చింది. సాగుచేస్తున్నది కౌలు రైతే అయినా ప్రభుత్వ ప్రయోజనాలన్నీ ఇదివరకు పట్టేదారుకే అందేవి. దీంతో పంటనష్టపోయిన సందర్భాల్లో, రుణాలు పొందే సమయంలో, రాయితీలు అందుకునే వేళ కౌలు రైతుకు అన్యాయం జరిగింది. ఈచట్టం ప్రకారం కౌలు రైతుకు భూమిపై ఎలాంటి హక్కు కల్పించ బడదు. పట్టేదారుకు దీని వల్ల ఎలాంటి హాని ఉండదు. కౌలు రైతు చట్టంపై రైతులకు అవగాహన లోపించడంతోనే చాలా మంది కౌలు రైతులు దీన్ని ఉపయోగించుకోలేక పోతున్నారు. కౌలు రైతుకు దృవీకరణ లభిస్తే భూమిపై తాము హక్కును కోల్పోతామేమోన్న భయం పట్టేదారుల్లో ఉండటంతో వారు కౌలు రైతులకు ఈ అవకాశాన్ని ఇవ్వడం లేదు. సాగును తమ పేరునే రాయించుకొంటున్నారు. దీంతో రైతు ప్రయోజనాలన్నీ పట్టేదారులకే వర్తిస్తున్నాయి. కౌలు రైతులు తమకు ఎల్‌ఈసీ కార్డులు కావాలని దరఖాస్తు చేసుకోకపోవడం వల్లకూడా వారికి ఈ చట్టం వర్తించకుండా పోతోంది. ఎలాంటి వివాదం లేని దరఖాస్తులను దృవీకరించడంతో
తొంబైశాతం మందికి కౌలు రైతులకు ఎల్‌ఈసీలు లభించడం లేదు. ఈవిషయంలో రైతులకు అవగాహన కల్పించేందుకు రెవెన్యూ అధికారులు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. కాని ఈ కార్యక్రమాలు తూతూమంత్రంగానే ఉన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల్లో అవగాహన, అధికారుల్లో చిత్తశుద్ది లోపించడంతో కౌలు రైతులకు ప్రభుత్వ ప్రయోజనాలు అందకుండా పోతున్నాయి.

Other News

Comments are closed.