క్యాంప్‌ రాజకీయాలు షురూ!

share on facebook

– కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలపై బీజేపీ గురి
– లింగాయత్‌ ఎమ్మెల్యేలను లాగేలా ప్రయత్నాలు
– ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్తపడుతున్న కాంగ్రెస్‌, జేడీఎస్‌
– హైదరాబాద్‌, వైజాగ్‌కు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు?
బెంగళూరు, మే17(జ‌నం సాక్షి) : కర్ణాటక రాజకీయం రంజుగా మారింది. క్యాంప్‌ రాజకీయాలు షురూ అయ్యాయి.. ఎప్పుడు ఏ పార్టీ ఎమ్మెల్యే ఏ పార్టీలో చేరుతారోనన్న ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్‌, జేడీఎస్‌లు తమ ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్త పడుతున్నాయి.. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడంతో అసలు కథ ఇప్పుడు మొదలు కానుంది. గవర్నర్‌ బల నిరూపణ కోసం 15 రోజుల సమయం ఇచ్చారు. నిజానికి యడ్యూరప్ప అడిగింది వారం రోజులే అయినా.. గవర్నర్‌ 15 రోజులు ఇవ్వడంపైనా ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఎమ్మెల్యేలతో బేరసారాలు మొదలయ్యాయి. బీజేపీ ముందు ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి. ఒకటి తమకు తక్కువగా ఉన్న 8 మంది ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్‌ లేదా జేడీఎస్‌ల వైపు చూడటం.. లేదంటే బల నిరూపణ సమయానికి ఆ రెండు పార్టీల నుంచి పలువురు ఎమ్మెల్యేలు అసలు సభకు హాజరు కాకుండా చేయడం. రెండో దారిలో వెళ్తే సభలో ఎమ్మెల్యేల సంఖ్య తగ్గి బీజేపీ ఇప్పుడున్న సంఖ్యతోనే బల నిరూపణ చేసుకోగలుగుతుంది. మొదటి దారిలో వెళ్లాలంటే మాత్రం కనీసం మరో 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి అవసరమవుతారు. దీనికోసం కాంగ్రెస్‌లోని లింగాయత్‌ ఎమ్మెల్యేల వైపు బీజేపీ చూస్తోంది. కాంగ్రెస్‌, జేడీఎస్‌ కూటమిలో పది మందికిపైగా లింగాయత్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. వొక్కలిగ అయిన కుమారస్వామి సీఎం కావడం వీళ్లకు ఇష్టం లేదు. దీంతో లింగాయత్‌ కమ్యూనిటీలో పెద్ద నేతగా ఉన్న యడ్యూరప్ప వైపు వీళ్లు చూసే అవకాశం ఉంది. ఇక లింగాయత్‌లకు ప్రత్యేక మతం, మైనార్టీ ¬దా ఇవ్వాలన్న కాంగ్రెస్‌ ప్రతిపాదనను కూడా వీళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో వీళ్లంతా బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కర్ణాటకలో లింగాయత్‌లు, వొక్కలిగాల మధ్య ఎన్నాళ్లుగానో రాజకీయ వైరం ఉంది. 2007లో ఒప్పందం ప్రకారం సీఎం పీఠాన్ని బీజేపీకి ఇవ్వాల్సిన కుమారస్వామి దానికి అంగీకరించకపోవడం వీళ్ల మధ్య వైరాన్ని మరింత ముదిరేలా చేసింది. ఇప్పుడిదే పాయింట్‌ను ఆసరాగా చేసుకొని కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేల వేటలో బీజేపీ ఉంది. మరి ఆ పార్టీ ఎంత వరకు సక్సెసవుతుందో చూడాలి.
హైదరాబాద్‌ లేదా వైజాగ్‌కు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు?
యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంతో కర్ణాటకలో పొలిటికల్‌ హీట్‌ మరింత పెరిగింది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలు మరిన్ని జాగ్రర్తలు తీసుకుంటున్నాయి. కర్నాటకలో ఉంటే ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కష్టమని భావిస్తున్న ఆ రెండు పార్టీలు వారిని వేరే రాష్టాల్రకు తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందులో భాగంగానే జేడీఎస్‌ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌ లేదా వైజాగ్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయని జేడీఎస్‌ వర్గాలు తెలిపాయి. మరోవైపు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కేరళకు తీసుకురావాలని లెఫ్ట్‌ పార్టీలు ఆహ్వానించాయి. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జేడీఎస్‌ క్యాంప్‌ నిర్వహిస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఓ ¬టల్‌లో ఉన్నారు. ఏసీ రూంలో జోరుగా రాజకీయ మంతనాలు సాగిస్తున్నారు. విశ్వాస పరీక్షలో యడ్యూరప్ప ఓడిపోతే కుమారస్వామికే సీఎం పదవి దక్కుతుందని జేడీఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Other News

Comments are closed.