గద్వాలలో చరిత్ర సృష్టిస్తాం

share on facebook

గద్వాల,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): గద్వాలలో 70 ఏళ్లలో జరగని అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో చేసి చూపించిందని గద్వాల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితెలిపారు. ఈ ప్రాంత ప్రజల ఓట్ల నుంచి ఎన్నికై మంత్రిగా పదవులు అనుభవించిన ఈ ప్రాంత నేత తనతో పాటు వారి కార్యకర్తలను అభివృద్ధి చేసుకున్నారే తప్ప, గద్వాల నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయలేదని పరోక్షంగా డికె అరుణను విమర్శించారు. ఇక్కడ గెలిచి చరిత్ర సృష్టిస్తామని అన్నారు. 40 ఏళ్ల పాటు ఒకే కుటుంబానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు అధికారాన్ని చేజిక్కించుకొని ప్రజలను భయ బ్రాంతులకు గురిచేసి పాలించారని ఆరోపించారు. ప్రస్తుతం వారు నియోజక వర్గంలో అభివృద్ధి నిరోధకులుగా మిగిలి పోయారన్నారు. ఎన్నో ఏళ్లుగా గద్వాల నియోజకవర్గ ప్రజలు అనుభవిస్తున్న బాధలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొలగించిందన్నారు. గతంలో అభివృద్ధి పనుల కోసం కాంగ్రెస్‌ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరిన ప్రతి కార్యకర్తను కళ్లల్లో పెట్టి చూసుకుంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు కుటుంబ పాలనలో విసిగి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరిన వారికి ఎప్పటికీ సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం కార్యకర్తలు, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. కార్యకర్తలు కూడా పార్టీకి అండగా ఉండాలని కోరారు.

Other News

Comments are closed.