గాడ్సే కంటే దుర్మార్గుడు చంద్రబాబు

share on facebook

– ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాబుకు ఎన్టీఆర్‌ బొమ్మ గుర్తొస్తుంది
– తెలంగాణలో తనను అడ్డుపెట్టుకొని బాబు బతికిపోయాడు
– కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకుంటున్నాడు
– ఎన్నికల ముందు ప్రజల మభ్యపెట్టేందుకు అన్నా క్యాంటిన్లు
– తెదేపా బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు
తిరుపతి, జులై12(జ‌నం సాక్షి) : మహాత్మాగాంధీని హత్యచేసిన గాడ్సే కంటే దారుణమైన వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. చిత్తూరు పర్యటనలో ఉన్న మోత్కుపల్లి తిరుపతిలో గురువారం విూడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో పాటు ఆయన వెనుకున్న ప్రతి ఒక్కరినీ చంపించిన చరిత్ర చంద్రబాబుదంటూ ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు మహానేత ఎన్టీఆర్‌ గుర్తురారని, నందమూరి కుటుంబం చంద్రబాబు చుట్టు తిరగాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబుకు ఎన్టీఆర్‌ బొమ్మ గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓటు వేయకుండా చంద్రబాబుకు ఏపీ ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో తనను అడ్డం పెట్టుకుని చంద్రబాబు బతికిపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కాలుపెట్టిన ప్రాంతం నాశనమేనని చెప్పారు. తాను పెద్ద మాదిగ అని చెప్పిన చంద్రబాబు నోటివెంట దళితుల మాటే లేదన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. కాపులు, బీసీల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టి పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ఎస్సీలు, ఎస్టీలు ఎవరూ జడ్జీలు ఎందుకు కాకుడదో చెప్పాలని ఏపీ సీఎంను డిమాండ్‌ చేశారు. దళితుడ్ని కాబట్టే నన్ను అవమాన పరిచాడని.. చంద్రబాబుది నోరా.. తాటిమట్టా అంటూ మండిపడ్డారు. తనకు ఎవరి సపోర్ట్‌ లేదని, అందరికీ నేనే సపోర్ట్‌ చేస్తున్నానని మోత్కుపల్లి అన్నారు.
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని పేర్కొన్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అప్పటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డికి డబ్బులిచ్చి పంపింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఆ కేసులో ఇద్దరు ఉన్నారు కాబట్టి పార్టీ నుంచి రేవంత్‌ను సస్పెండ్‌ చేయలేదని అభిప్రాయపడ్డారు. జీవితం అంతా నీ కోసం త్యాగం చేశాను, మరి నన్ను పార్టీ నుండి సస్పెండ్‌ చేశావ్‌ అని చంద్రబాబును ప్రశ్నించారు. తాను తప్పు చేస్తే చెప్పాలని, ముక్కును నేలకు రాసుకుంటానని సవాల్‌ విసిరారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికే అన్నా క్యాంటీన్లను చంద్రబాబు ప్రారంభించారని మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.

Other News

Comments are closed.