గెలిస్తే 24 గంటలు మంచినీళ్లు

share on facebook

– భాజపా మేనిఫెస్టో విడుదల

హైదరాబాద్‌,నవంబరు 26(జనంసాక్షి):జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేస్తామని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా ప్రస్తుత ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం మోపిందని అన్నారు. ఇవాళ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని మరోసారి ప్రమాణం చేస్తున్నట్లు చెప్పారు. ముంబయి దాడులు జరిగింది కూడా ఇవాళేనని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర భాజపా కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. సామాన్యుడి ఆకాంక్షల మేరకే మేనిఫెస్టో రూపొందించామన్నారు. దేశమంతటికీ 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే హైదరాబాద్‌ సంస్థానానికి 1948 సెప్టెంబరు 17న వచ్చిందని, భాజపా అధికారంలోకి వస్తే సెప్టెంబరు 17ను విమోచన దినంగా జరుపుతామని ఫడణవీస్‌ తెలిపారు. కొవిడ్‌ సమయంలో హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రులు సామాన్యులను దోచుకున్నాయన్నారు. మరోవైపు వరదల నివారణకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని, వరద సాయం కింద అర్హులందరికీ రూ.25వేల చొప్పున అందిస్తామని హావిూ ఇచ్చారు. ఓటు బ్యాంకు కోసం చేసిన తప్పిదాల వల్లే నగరం మునిగిపోయిందని విమర్శించారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఫడణవీస్‌ ఆరోపించారు.తాము అధికారంలోకి వస్తే సామాన్యుడి సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, భూపేంద్ర యాదవ్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.