గోవా సిఎంగా ప్రమోద్‌ సావంత్‌

share on facebook

అర్థరాత్రి 2గంటలకు ప్రమాణం
నేడు బలపరీక్షకు సిఎం నిర్ణయం
పనాజి,మార్చి19(జ‌నంసాక్షి): అనేక నాటకీయ పరిణామాల మధ్య గోవా  స్పీకర్‌ ప్రమోద్‌ సావంత్‌.. ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం అర్థరాత్రి 2 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఆయనతో గవర్నర్‌ మృదులా సిన్హా ప్రమాణంచేయించారు. కూటమి పార్టీలను ఒక్క దగ్గరకు తీసుకువచ్చేందుకు సోమవారం బీజేపీ పార్టీ శ్రేణులు తెగ కష్టపడ్డారు. సీఎం మనోహర్‌ పారికర్‌ మృతిచెందడంతో.. గోవాలో ఈ పరిణామం చోటుచేసుకున్నది. సోమవారం సాయంత్రమే పారికర్‌ పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే 45 ఏళ్ల ప్రమోద్‌ సావంత్‌కే సీఎం పదవి దక్కే
అవకాశాలు ఉన్నట్లు  ఉదయం నుంచే ఊహాగానాలు వినిపించాయి. వాస్తవానికి రాత్రి 11 గంటలకు  ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నారు. కానీ ఆ కార్యక్రమాన్ని అర్థరాత్రి 2 గంటలకు మార్చేశారు. గోవా ఫార్వర్డ్‌ చీఫ్‌ విజయ్‌ సర్దేశాయ్‌, మహారాష్ట్రవాది గోమాంతక్‌ పార్టీ ఎమ్మెల్యే సుదిన్‌ దవలికర్‌లు ప్రస్తుతం డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. గోవా క్యాబినెట్‌లో మరో 9 మంది మంత్రులుగా ఉన్నారు. డిప్యూటీ స్పీకర్‌ మైఖేల్‌ లోబో .. ఇప్పుడు స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. పారికర్‌ అంత్యక్రియలు జరిగిన తర్వాత జరిగిన బీజేపీ సమావేశంలో సావంత్‌ను సభా నేతగా ఎన్నుకున్నారు.  గోవా అసెంబ్లీలో బుధవారం బలపరీక్ష ఉంటుందని ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్‌ సావంత్‌ తెలిపారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. మనోహర్‌ పారికర్‌ మృతి నేపథ్యంలో ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించామని, ఇది పూర్తయ్యే వరకు తనకెవరూ శుభాకాంక్షలు చెప్పొద్దని, పూలతో స్వాగతించొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అని సావంత్‌ పేర్కొన్నారు. డిప్యూటీ సీఎంలుగా విజయ్‌ సర్దేశాయ్‌, సుదిన్‌ దవలికర్‌లు కొనసాగుతున్నారని ఆయన చెప్పారు.  పారికర్‌ మృతి చెందిన తర్వాత గోవాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా కాంగ్రెస్‌ ను ఆహ్వానించాలంటూ గవర్నర్‌ మృదుల సిన్హాకు ఆ పార్టీ నాయకులు లేఖ అందించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేసి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ లేఖలో పేర్కొంది. 40 స్థానాలున్న గోవా శాసనసభలో ప్రస్తుతం 36 మంది సభ్యులున్నారు. వారిలో కాంగ్రెస్‌ సభ్యులు 14 మంది, బీజేపీకి చెందినవారు 12 మంది ఉన్నారు. మహారాష్ట్ర గోమంతక్‌ పార్టీ, గోవా ఫార్వర్డ్‌ పార్టీలకు చెరో మూడు స్థానాలున్నాయి. ఈ ఆరుగురు సభ్యులతో పాటు మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు.

Other News

Comments are closed.