ఘర్షణ జరిగిన ప్రాంతాల్లో..  రీపోలింగ్‌ నిర్వహించండి 

share on facebook

– ఈసీకి బీజేపీ ప్రతినిధుల బృందం వినతి
న్యూఢిల్లీ, మే20(జ‌నంసాక్షి) : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో మళ్లీ పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘానికి బీజేపీ విజ్ఞప్తి చేసింది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, రైల్వేమంత్రి పియూష్‌ గోయల్‌ సారథ్యంలోని బీజేపీ ప్రతినిధుల బృందం ఈ మేరకు సోమవారం ఈసీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసీని కలిసిన అనంతరం పియూష్‌ గోయల్‌ మాట్లాడుతూ… ‘లోక్‌సభ ఎన్నికల్లోని అన్ని దశల పోలింగ్‌లోనూ జరిగిన హింసాత్మక ఘటనలను ఎన్నికల కమిషనర్లకు వివరించామన్నారు. హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న ప్రతిచోటా రీపోలింగ్‌ నిర్వహించాలని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ నేతలపై పెట్టిన ‘తప్పుడు కేసులను’ ఉపసంహరించుకోవాలని కూడా ఈసీని కోరినట్టు ఆయన తెలిపారు. ఎన్నికల తర్వాత కూడా రాష్ట్ర ప్రజలను తామే పరిపాలిస్తామంటూ సీఎం మమతా బెనర్జీ ప్రజలను బెదిరించారని అన్నారు. ఈ విషయాన్ని కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కూడా పశ్చిమ బెంగాల్లో హింస కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నామని, అందుకే ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు పశ్చిమ బెంగాల్లో కేంద్ర బలగాలను కొనసాగించాలని కోరామని గోయల్‌ తెలిపారు. ఓట్ల లెక్కింపు పక్రియ స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతుందో లేదోనని తాము ఆందోళన చెందుతున్నామన్నారు. ‘ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్‌ రూమ్‌లన్నిటి వద్ద తప్పనిసరిగా కేంద్ర బలగాలను రక్షణగా ఉంచాలని కోరామన్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, కర్నాటక, మధ్య ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక పరిశీలకులను నియమించాలని కోరామని కేంద్రమంత్రి పియూష్‌గోయాల్‌ వెల్లడించారు.

Other News

Comments are closed.