చంద్రబాబు కుట్రలకు బలికావద్దు

share on facebook

మరోమారు కెసిఆర్‌ సిఎం కావాలి

ప్రచారంలో నిరంజన్‌ రెడ్డి

వనపర్తి,నవంబర్‌6(జ‌నంసాక్షి): రాష్ట్రంపై చంద్రబాబు పెత్తనం చెలాయించేందుకు కుట్రలు పన్నుతున్నారని

వనపర్తి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి నిరంజన్‌ రెడ్డి అన్నారు. కుట్రలు, కుతంత్రాలతో మాయ చేసేందుకు వస్తున్న ప్రతిపక్షాలకు రాబోయే ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వివిధ గ్రామాల్లో పర్యటించి ఆయన ప్రచారం చేస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఓటమి భయంతోనే టీడీపీతో కాంగ్రెస్‌ జతకట్టి మహాకూటమి పేర వస్తున్నాయని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్‌ దశాబ్దాలపాటు అధికారంలో ఉన్నా జరుగని అభివృద్ధి, సీఎం కేసీఆర్‌ నాలుగున్నరేండ్లలో చేశారని చెప్పారు. హైదరాబాద్‌ను పడగొట్టి అమరావతిని పెంచేందుకు డబ్బు వెదజల్లి టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పే మహాకూటమిని బొందపెట్టి టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మళ్లీ సీఎంగా కేసీఆరే అధికారంలోకి వస్తారని అన్నారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ముందంజలో ఉన్న తెలంగాణ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయలాంటి పథకాలతో సాగునీటికి శాశ్వత పరిష్కారం చూపి దేశంలోనే టీఆర్‌ఎస్‌ సర్కారు మొదటిస్థానంలో నిలువనుందని అన్నారు. సీఎం కేసీఆర్‌ అమలుచేస్తున్న పథకాలను చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు తాము తెలంగాణలో ఎందుకులేమని బాధపడుతున్నారని తెలిపారు. మరోసారి ప్రజలు ఆశీర్వదించి టీఆర్‌ఎస్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. తెలంగాణ రైతులపై కాంగ్రెస్‌, టీడీపీలకు ఏమాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై గ్రీన్‌ట్రిబ్యునల్‌లో వేసిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతులపై సవతితల్లి ప్రేమను ఒలకబోస్తున్న కాంగ్రెస్‌, టీడీపీలు ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రాణధారమైన పాలమూరు ఎత్తిపోతలపై కుట్రపూరితమైన కేసులు వేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన అనేక సాగునీటి ప్రాజెక్టులపై రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకు కాంగ్రెస్‌, టీడీపీలు ఒక్కటయ్యాయని, ప్రజలు ఓటుతో కూటమికి తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.

 

Other News

Comments are closed.