చిరుధాన్యాల కొనుగోలుకు ఏర్పాట్లు

share on facebook

రైతులకు కలెక్టర్‌ హావిూ

ఆదిలాబాద్‌,జూలై12(జ‌నం సాక్షి): ఈ ఏడాది ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో చిరుధాన్యాల కొనుగోలుకు మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ హావిూ ఇచ్చారు.పంటల వివరాలను ముందుగానే సేకరిస్తుండడంతో దళారుల దందాకు చెక్‌ పడటమే కాకుండా రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర లభిస్తుంది. రైతులు ఎప్పటికప్పుడు వ్యవసాయశాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకొని ఏయే సమయంలో ఏ మందులు ఎంత మోతాదులో వాడుకోవాలో తెలుసుకోవాలన్నారు.ఈ సీజన్‌లో పత్తి, సోయాబిన్‌, కంది, మినుమ, పెసర పంటలు వేస్తారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మార్కెట్‌యార్డుల్లోని ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పంటల కొనుగోళ్లు జరుగుతాయి. జిల్లాలో ఆదిలాబాద్‌, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బోథ్‌, జైనథ్‌ మార్కెట్‌యార్డులు ఉన్నాయి. వీటితో బేల, హస్నాపూర్‌లో సబ్‌మార్కెట్‌ లలో కొనుగోళ్లు నిర్వహిస్తారు. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, మార్కెఫెడ్‌, ఆయిల్‌ ఫెడ్‌ లాంటి సంస్థలు జిల్లాలో పత్తి, కంది, సోయాబీన్‌ పంటలను కొనుగోలు చేస్తాయి. జిల్లాలో యాసంగిలో సాగుచేసిన శనగ పంటను సైతం నాఫెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తారు. జిల్లాలోని నాలుగేళ్లుగా ప్రభుత్వరంగ సంస్థల ద్వారా పంటలను కొనుగోలు చేయడంతో రైతులకు కనీస మద్దతు ధర లభిస్తోంది. కొందరు దళారులు రైతులు సాగుచేసిన పంటలను తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాల్లో అమ్ముతూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. దళారులు అక్రమ దందా కారణంగా అసలైన రైతులు నష్టపోవాల్సి వస్తుంది. వ్యవసాయశాఖ అధికారులు జిల్లాలో రైతుల వారీ గా సాగుచేసిన పంటల వివరాలు సేకరించేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో పంటల కొనుగోళ్లు పారదర్శకంగా జరుగుతాయి. పంట దిగుబడిని అంచనా వేసి దీని ఆధారంగా రైతులకు వారు ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. పంటల కొనుగోళ్లలో ఏఈవోలు ధ్రువీకరణ పత్రాలను అసలైన రైతులకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉండడంతో దళారులు వివిధ పంటలను మార్కెట్‌యార్డుకు తీసుకువచ్చే అవకాశం ఉండదు. ఇకపోతే సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు.

Other News

Comments are closed.