చీరల్లోనూ చేతివాటం! – షబ్బీర్‌ అలీ

share on facebook

 

గోదావరిఖని, సెప్టెంబర్‌ 28, (జనంసాక్షి) : కరీంనగర్‌: తెలంగాణ ప్రభుత్వంపై శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బతుకమ్మ పండగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు పంపిణీ చేసిన బతుకమ్మ చీరల్లోనూ తెరాస నేతలు కవిూషన్లకు కక్కుర్తి పడ్డారని విమర్శించారు. గురువారం ఆయన పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో నిర్వహించిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిట్టల దొరేయని, మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని… మాజీ మంత్రి, విధాన మండలిలో కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ షబ్బీర్‌ అలీ ఆరోపించారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి షబ్బీర్‌అలీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సింగరేణిలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ప్రజాస్వామ్యానికి టీఆర్‌ఎస్‌కు చెందిన పాలకవర్గపు ప్రతినిధులు తూట్లు పొడుస్తున్నారన్నారు.టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అనుకూలమై రీతిలో సింగరేణి చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నడిమెట్ల శ్రీధర్‌ వ్యవహరించడం ఆక్షేపణీయమన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓ చెంచాగా శ్రీధర్‌ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శ్రీధర్‌ ఈ విధానాన్ని అవలంభించడం సహించమన్నారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో అధికారం చేపట్టనున్నామని,కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్రీధర్‌ భరతం పడుతామని ఆయన హెచ్చరించారు. సింగరేణి ఎన్నికల్లో గుర్తింపు సంఘ అధికారాన్ని కైవసం చేసుకోవడానికి కార్మికులను ప్రలోభపెట్టడానికి టీబీజీకేఏస్‌ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో సంఘ శ్రేణులతో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీలోని ప్రముఖులు ప్రయత్నాలు జరుపుతున్నారని, హైదరాబాద్‌ నుంచి పంపే కవిత డబ్బుల సంచులు కార్మికులపై ఎటువంటి ప్రభావం చూపదని అన్నారు. వారు ఎన్నిక కుతంత్రాలు చేసినా, ఎన్ని ప్రలోభాల పెట్టిన తాము బలపరిచే చుక్క గుర్తుకే ఓటు వేసి తీరుతారని, ఐఎన్‌టియుసికి విజయకేతనం అందిస్తారని,ఈ సంకేతాలు తమకు సంపూర్ణంగా అందాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో భాగంగా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో షబ్బీర్‌ అలీ పర్యటించారు. అందులో భాగంగా ఆయన టీబీజీకేఏస్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శించారు. ఐఎన్‌టియుసి,ఎఐటియుసి కలయికతో దేశంలో, రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటికరించకుండా అడ్డుపడే సత్తా ఉందన్నారు. టీబీజీకెఎస్‌ గత నాలుగు సంవత్సరాల నుంచి ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదన్నారు. వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దగా చేశారని షబ్బీర్‌ అలీ ఆరోపించారు. కార్మికుల హక్కులు, సమస్యలు పరిష్కారం కావాలంటే… ఎఐటియుసి, ఐఎన్‌టియుసితోనే సాధ్యమనే విషయాన్ని కార్మికులు గుర్తెరుగాలన్నారు. కార్మికులు ఎఐటియుసిని బలపర్చి సంస్థ భవిష్యత్‌ను కాపాడాలని కోరారు. అక్టోబర్‌ 5న జరిగే సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఏస్‌ను మట్టికరిపించి, ఎఐటియుసిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో బెల్లంపల్లి శాంతినగర్‌ గనిలో ప్రమాదం జరిగి ముగ్గురు వ్యక్తులు మరణిస్తే అధికార పార్టీ నాయకులు, టీబీజీకేఏస్‌ నాయకులు ఒక్కరు కూడా వెళ్లలేదన్నారు. 72 గంటల సమయం పట్టినా ఒక్క సింగరేణి అధికారి కానీ, సీఎండీ కానీ అటు దిక్కుచూసిన పాపాన పోలేదన్నారు. టీబీజీకేఏస్‌కు గౌరవ అధ్యక్షురాలుగా వున్న కవిత సైతం అక్కడి పరిణామాలపై స్పందించకపోవడం విడ్డూరమన్నారు. బెల్లంపల్లి, కాసిపేట గనుల్లో పర్యటన సందర్బంగా మంచి స్పందన వచ్చిందని షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. గుర్తింపు సంఘంగా ఎఐటియుసి గెలువడం ఖాయమన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతుందని, ఘంటాపతంగా షబ్బీర్‌అలీ తెలిపారు. కార్మికులు మంచి జోష్‌ మీద ఉన్నారని, టీబీజీకేఏస్‌ను ఓడించడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ త్యాగాలపై నడుస్తున్నదని, పోరాట చరిత్ర కలదని కార్మికులు మరువ రాదన్నారు. 1993-04 సంవత్సరంలో సింగరేణి సంస్థ బీఐఎఫ్‌ఆర్‌లోకి వెళితే.. అప్పటి ప్రధాన మంత్రి పీ.వీ.నర్సింహారావు చొరవతో రూ.460 కోట్లు ఒకసారి, రెండవసారి రూ.700 కోట్లు ఇచ్చి సింగరేణిని కాపాడారన్నారు. సింగరేణిలో లక్షా 30వేల మంది కార్మికులున్న సింగరేణిలో కేవలం 53వేల మంది మాత్రమే ఉన్నారని, దీనికి కేసీఆర్‌ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి కార్మికులకు సంబంధించి హక్కులు, సమస్యలు పరిష్కారం కావాలంటే కేవలం ఎఐటియుసి, ఐఎన్‌టియుసితోనే సాధ్యమన్నారు. కార్మికులు ఆలోచించి ఓటు వేసి ఎఐటియుసిని గెలిపించాలని షబ్బీర్‌ అలీ కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జనక్‌ప్రసాద్‌, వై.గట్టయ్య, బడికెల రాజలింగం, కాల్వ లింగస్వామి, పి.ధర్మపురి, మహాంకాళి స్వామి, సుతారి లక్ష్మణ్‌బాబు, సురేందర్‌, కోటగిరి పాపయ్య, కంది చంద్రయ్య, ఊట్ల కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల వస్త్రాలంటూ సూరత్‌ నుంచి తెప్పించి కవిూషన్లు తిన్నారన్నారు. రూ.50ల విలువచేసే చీరలు తెచ్చి రూ.200 అంటూ మోసం చేశారని ఆరోపించారు. రంజాన్‌లో జకాత్‌, బతుకమ్మలో చీరలు, క్రిస్మస్‌లో కేకులూ ఎవరూ అడగలేదన్నారు. ముస్లింలకు న్యాయం చేయాలనుకుంటే 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు ప్రత్యేకంగా నిధులు కేటాయించి కాపాడిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

 

 

Other News

Comments are closed.