జిల్లాలో ముందస్తు ఎన్నికల సందడి

share on facebook

ఊపందుకున్న టిఆర్‌ఎస్‌ ప్రచార పర్వం

జనగామ,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): ముందస్తు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారానికి సన్నద్ధం అవుతున్నారు. జిల్లాకు చెందిన మూడు నియోజకవర్గాల్లో సిట్టింగులకే మరోసారి అవకాశం కల్పించడంతో విస్తృత ప్రచారం చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కుల సంఘాలతో సమావేశాలు, ఓటర్ల జాబితాపై దృష్టి సారించడంతో జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంటోంది.గులాబీ అధినేత కేసీఆర్‌ అభ్యర్థిత్వాలను ప్రకటించిన తర్వాత ఇప్పటికే జిల్లాకు చెందిన పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, డాక్టర్‌ తాటికొండ రాజయ్య తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. జనగామ జిల్లా అంతటా గులాబీ క్యాడర్‌ ఫుల్‌ జోష్‌తో కళకళలాడుతోంది. ముందస్తు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిన పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రణాళికల్లో నిమగ్నమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో ఇటు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారం ప్రారంభించగా..అటు అధికార యంత్రాంగం పోలింగ్‌ నిర్వాహణకు సన్నద్ధమవుతోంది. ఎన్నికల షెడ్యూల్‌ ఎప్పుడు వచ్చినా నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అధికార యంత్రాంగం దృష్టి సారించింది. పోలింగ్‌ కేంద్రాలు, ఓటర్ల జాబితా, సామగ్రి, ఈవీఎంలను సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వరకు ఓటర్ల నమోదు పక్రియ కొనసాగించనున్నారు.

Other News

Comments are closed.