జిల్లా నూతన కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవానికి పూర్తిస్థాయిలో సిద్దంగా ఉండాలి : రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పనశాఖ మంత్రి మల్లారెడ్డి

share on facebook
మేడ్చల్(జనంసాక్షి) : మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ఈనెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన పూర్తిస్థాయిలో ఏర్పాటు  చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, జిల్లా కలెక్టర్ హరీశ్ తో కలిసి షామీర్పేటలోని నూతన సమీకృత కలెక్టరేట్‌ను సందర్శించి కలియదిరిగి అక్కడ జరుగుతున్న పనులు, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ముప్పై ఎకరాల్లో రూ.56.20 కోట్లతో అన్ని హంగులతో నూతన కలెక్టరేట్‌ను నిర్మించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపారన్నారు. ఈనెల 17న ముఖ్యమంత్రి చేతుల మీదుగా కొత్త కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నందున ఇప్పటికీ ఇంకా ఏమైనా పనులు చేయాల్సినవి ఉంటే వేగవంతం చేసి పూర్తి చేయాలని సూచించారు. అలాగే కలెక్టరేట్ మొత్తం కలియదిరిగి  కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి స్వయంగా ముఖ్యమంత్రి రానున్నందున  జిల్లా అధికారులందరూ అప్రమత్తంగా వారికి అప్పగించిన బాధ్యతలను ఏమాత్రం పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా చేయాలని మంత్రి తెలిపారు. ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఉండాలని కోరారు.  కొత్త కలెక్టరేట్ భవనాన్ని  రంగురంగుల విద్యుత్ లైట్లతో అలంకరించాలని అన్నారు.  కలెక్టరేట్ ఆవరణలో, చుట్టుపక్కల ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉన్నా అక్కడ మొక్కలు నాటాలన్నారు.   అలాగే ముఖ్యమంత్రికి సంబంధించిన సభావేదికకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు, సలహాలు చేశారు.  కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందికి అప్పగించిన పనులను బాధ్యతతో చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి మల్లారెడ్డి అధికారులకు తెలిపారు.  మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలు వచ్చేందుకు నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనం ఎంతో సౌలభ్యంగా ఉంటుందని  దాంతో పాటు  ఔటర్ రీజనల్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) రోడ్డును ఆనుకొని పక్కనే ఉండటం వల్ల  ప్రజలకు మరింత అందుబాటులో ఉంటుందని మంత్రి  ఆశాభావం వ్యక్తం చేశారు.  నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనంలో అన్ని శాఖల అధికారులకు ప్రత్యేక విభాగాలతో నిర్మించినట్లుగా మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈనెల 17న నూతన కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అలాగే సమావేశానికి సుమారు 12 వేల మంది వస్తారని భావిస్తున్నామని అందుకు తగిన ఏర్పాట్లు ఏమాత్రం ఇబ్బందులు తలెత్తకుండా చేయాల్సిందిగా మంత్రి మల్లారెడ్డి కలెక్టర్‌కు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఈ అండ్ సీ గణపతిరెడ్డి, ఇంటలీజెన్స్ ఎస్పీ ఎన్.వి.కృష్ణారావు ,జిల్లా అదనపు కలెక్టర్లు శ్యాంసన్, లింగ్యానాయక్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి (డీఆర్డీఏ పీడీ) పద్మజారాణి, జడ్పీ సీఈవో దేవసహాయం, జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి, ఆర్ అండ్ బీ ఈఈ శ్రీనివాస్, ఎస్ఈ శ్రీనివాసరావు, ఉద్యానవనశాఖ అధఙకారి నీరజాగాంధీ, , తూముకుంట మునిసిపల్ చైర్మన్ ,కే రాజేశ్వర రావు ,  అధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు
 

Other News

Comments are closed.