జోరుగా చెక్కుల పంపిణీ

share on facebook

గ్రామాల్లో పర్యటిస్తున్న నేతలు
భద్రాద్రి కొత్తగూడెం,మే16(జ‌నం సాక్షి): జిల్లాలో రైతుబంధు పథకం కింద గ్రామసభల ద్వారా చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది.  పల్లెల్లో ఎక్కడ చూసని సందడి వాతావరణం నెలకొంది. బ్యాంకుల్లో చెక్కులను నగదుగా మార్చుకునేందుకు రైతులు పెద్ద ఎత్తున మూకుమ్మడిగా తరలి వెళ్తున్నారు. ఎక్కడ చూసినా రైతుబంధు చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ గురించే చర్చ జరుగుతోంది. ఖమ్మం ఎంపీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్‌ ఎంపీ సీతారాంనాయక్‌,ఎమ్మెల్యేలు జలగం వెంకటరావు,కోరం కనకయ్యలు గ్రామాల్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రైతులకు చెక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ఆరు రోజుల్లో 47,602 మందికి రూ.56 కోట్లు పంపిణీ జరిగింది. కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు పునుకులలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు.  తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకంలో భాగంగా అందజేస్తున్న పెట్టుపడి సాయాన్ని రైతులు సాగు కోసమే వినియోగించి, అధిక దిగుబడులు సాధించి సీఎం కేసీఆర్‌ సంకల్పాన్ని నెరవేర్చాలని వీరు సూచించారు.  రైతులకు చెక్కు అందించేటప్పుడు వేలిముద్ర ఇంకు చెక్కుకు అంటితే చెల్లకుండా ఉండే ప్రమాదం ఉందని, తద్వారా కాలయాపన జరిగి రైతు నష్టపోతారన్నారు. చెక్కుల పంపిణీ కేంద్రాల వద్ద రైతులకు తాగునీరు, వైద్యశిబిరం అందుబాటులో ఉంచాలన్నారు.  రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయం అందించేందుకే రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు అన్నారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడి నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.4వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తుందన్నారు. ఈ చెక్కులను 90
రోజుల్లోపు బ్యాంకుల్లో మార్చుకునే గడువు ఉందన్నారు. పెట్టుబడి సాయాన్ని రైతులు ఇతర ప్రయోజనాలకు వాడుకోకుండా వ్యవసాయానికి మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా ఇకపై రైతులు రుణాల కోసం బ్యాంకుల్లో పాస్‌ పుస్తకాలను తనఖా పెట్టాల్సిన పనిలేదన్నారు. పాస్‌ పుస్తకాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ రూపొందించడం జరిగిందని, బ్యాంకు మేనేజర్లు ఆ సాఫ్ట్‌వేర్‌ను శోధిస్తే ఏరైతుకు ఎన్ని ఎకరాలు భూమి ఉందో ఇట్లే తెలిసిపోతుందన్నారు.

Other News

Comments are closed.