టీకాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

share on facebook

– సీనియర్‌ నేతలను బరిలోకి దింపిన అధిష్టానం
– నల్గొండ బరిలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌
– ఖమ్మం మినహా అన్ని స్థానాల్లో ప్రకటించిన ఏఐసీసీ
– ఖమ్మంపై టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అదిష్టానాల తర్జనభర్జన
– నేడు ప్రకటించే అవకాశం
– ఖమ్మం తెరాస అభ్యర్ధిగా నామా నాగేశ్వరరావు?
– తెదేపా పార్టీకి రాజీనామా చేసిన నామా
హైదరాబాద్‌, మార్చి19(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇటీవల ఎనిమిది మంది జాబితాను విడుదల చేసిన ఏఐసీసీ, సోమవారం అర్థరాత్రి సమయంలో మరో ఎనిమిది మంది జాబితాను విడుదల చేసింది. ముఖ్యంగా జాబితా మొత్తంలో అత్యధికగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలకే అదిష్టానం పెద్దపీట వేసింది. అధిష్టానం ప్రకటించిన 16 స్థానాల్లోని అభ్యర్థుల్లో తొమ్మిదిమంది ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినవారు ఉండగా, మరో ఏడుగురు మాజీ ఎంపీలు ఉన్నారు. ఇదిలా ఉంటే నల్గొండ స్థానాన్ని ఉత్తమ్‌ ను అదిష్టానం బరిలోకి దింపింది. భువనగిరిలో కోమటిరెడ్డి, నిజామాబాద్‌ నుంచి మధుయాస్కిగౌడ్‌, హైదరాబాద్‌ నుంచి ఫిరోజ్‌ఖాన్‌, నాగర్‌కర్నూల్‌ బరిలో మల్లురవి, మహబూబ్‌నగర్‌ నుంచి వంశీచంద్‌, సికింద్రాబాద్‌ నుంచి అంజన్‌, వరంగల్‌ నుంచి సాంబయ్య పోటీ చేయనున్నారు. ఇదిలా ఉంటే నాగర్‌కర్నూల్‌ స్థానం నుంచి నంది ఎల్లయ్య, మల్లు రవి, సతీష్‌ మాదిగలు పోటీ పడ్డారు. మల్లు రవికి కాకుండా స్థానికులకే అవకాశం ఇవ్వాలని అదిష్టానం వద్ద స్థానిక కాంగ్రెస్‌ నేతలు వినతులు అందజేశారు. అటు గాంధీభవన్‌, ఢిల్లీలోని కాంగ్రెస్‌ భవన్‌ ఎదుట స్థానికులకే నాగర్‌కర్నూల్‌ స్థానాన్ని కేటాయించాలని పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. కాగా వీటినేవిూ అదిష్టానం పట్టించుకోలేదని నాగర్‌కర్నూల్‌ స్థానం నుంచి మల్లు రవిని బరిలోకి దింపడం ద్వారా స్పష్టమవుతుంది. మల్లు రవి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క సోదరుడు. భట్టి పట్టుబట్టడంతో ఆ స్థానాన్ని మల్లు రవికి అప్పగించినట్లు తెలుస్తొంది. మల్లు రవి కాకుండా ఈ స్థానం నుంచి సతీష్‌ మాదిగను బరిలోకి దింపాలని ఆ పార్టీ సినియర్‌ నేత డి.కె. అరుణ అధిష్టానానికి సూచించింది. కానీ అధిష్టానం డి.కె. అరుణ వాదనను పట్టించుకోకపోవటంతో పాటు నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్ధి మల్లు రవిని గెలిపించే బాధ్యతలను ఆమెకే అప్పగించడం విశేషం. మరోవైపు మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి పలువురు పోటీ పడ్డారు. కాగా జైపాల్‌ రెడ్డి గతంలో పోటీచేసి ఓడిపోవటంతో పాటు, ప్రస్తుతం ఆయన బరిలో నుంచి
తప్పుకున్నట్లు అదిష్టానంకు తెలపడంతో.. డి.కె. అరుణను బరిలోకి దింపేలా అదిష్టానం చర్చలు జరిపింది. కానీ డి.కె. అరుణ తాను బరిలోకి దిగేది లేదని తేల్చిచెప్పడంతో ఆ స్థానం నుంచి కల్వకుర్తి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన వంశీకృష్ణారెడ్డిని ఏఐసీసీ బరిలోకి దింపింది. ఇలా అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌లకే పెద్దపీట వేయడం గమనార్హం. కాగా అధిష్టానం తీరుతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ శ్రేణుల్లో వర్గవిబేధాలు భగ్గుమన్నాయి.
ఖమ్మంపై తర్జనభర్జన..
ఖమ్మం పార్లమెంట్‌ స్థానంలో అభ్యర్థుల ఎంపికపై ఇటు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ అదిష్టానాలు తర్జన బర్జన పడుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇప్పటికే మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలతోపాటు గాయత్రి రవిల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నా మొన్నటి వరకు నామా నాగేశ్వరరావును కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్ధిగా ప్రకటిస్తుందని అందరూ భావించారు. కానీ నామా నాగేశ్వరరావు అనూహ్యరీతిలో టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం సాగుతుంది. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలంతా తెరాస తీర్థం పుచ్చుకుండటంతో కాంగ్రెస్‌ నుంచి ఎవరిని బరిలోకి దింపాలా అని అదిష్టానం తర్జనబర్జన పడుతున్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి జీవీఆర్‌ పేరును ఓ దశలో అదిష్టానం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఖమ్మం ఎంపీ అభ్యర్ధి ఎంపికలో కాంగ్రెస్‌ అదిష్టానానికి తలనొప్పిగా మారింది. మరోవైపు తెరాస అదిష్టానాదికూడా అదే పరిస్థితి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెరాసకు అనుకూలంగా ఉంటే ఖమ్మంలో మాత్రం తెరాసకు చావుదెబ్బ తగిలింది. దీంతో ఖమ్మంలో ఎలాగైనా పట్టు సాధించేలో భాగంలో.. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకుంటున్నారు. మరోవైపు తెలంగాణలో టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న నామా కూడా తెరాసలోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల కేటీఆర్‌తో భేటీ అయిన నామా, సోమవారం ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కాగా మంగళవారం ఆయన తెదేపాకు రాజీనామా చేయడంతో తెరాస అభ్యర్ధి అనే వాదనలకు బలం చేకూరుతుంది. తెరాస సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఈ దఫా అవకాశం కల్పించేందుకు కేసీఆర్‌ విముఖత వ్యక్తం చేస్తుండటంతో.. ఆయన స్థానంలో వేరే వ్యక్తికి ఎంపీ టికెట్‌ కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే  వంకాయపాటి రాజేంద్రప్రసాద్‌ పేరు ప్రచారంలో ఉంది.. ఆయన ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రచారంసైతం చేస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా తెదేపాకు రాజీనామా చేసిన నామానాగేశ్వరరావు తెరాస పార్టీ తీర్థం పచ్చుకొనే అవకాశం ఉండటంతో నామానే ఖమ్మం ఎంపీ అభ్యర్ధిగా కేసీఆర్‌ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ మేరకు నేడు జాబితాను ప్రకటించేందుకు కేసీఆర్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఖమ్మం ఎంపీ అభ్యర్ధుల ఎంపిక అటు తెరాస, ఇటు కాంగ్రెస్‌ అదిష్టానాలకు పెద్ద తలనొప్పిగా మారినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Other News

Comments are closed.