డీడీసీఏకు సెహ్వాగ్‌ రాజీనామా

share on facebook

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : ఢిల్లీ అండ్‌ డిస్టిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ) సలహా కమిటీకి రాజీనామా చేస్తున్నట్లు టీమ్‌ ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ వెల్లడించాడు. డీడీసీఏ కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బౌలింగ్‌ కోచ్‌గా మనోజ్‌ ప్రభాకర్‌ను కొనసాగించాలని సెహ్వాగ్‌తో సహా కమిటీ సభ్యులైన ఆకాష్‌ చోప్రా, రాహుల్‌ సంఘ్వీలు మేనేజ్‌మెంట్‌కు ప్రతిపాదించగా, అందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో సెహ్వాగ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, సెహ్వాగ్‌ రాజీనామాకు ఇంకా ఆమోదం తెలపలేదు. అయితే డీడీసీఏ వర్గాల సమాచారం ప్రకారం.. ముగ్గురి రాజీనామాకు ఆమోదముద్ర పడినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారట. వచ్చే రెండు రోజుల్లో సరికొత్త ప్యానల్‌ను సైతం నియమించనున్నట్లు తెలుస్తోంది.
ప్రభాకర్‌ను బౌలింగ్‌ కోచ్‌గా అంగీకరించకపోవడం వల్లే తాను రాజీనామా చేసినట్లు సెహ్వాగ్‌ వెల్లడించారు. ‘క్రికెట్‌ కమిటీలో భాగస్వాములైన మేమంతా కలిసి ఢిల్లీ క్రికెట్‌ అభివృద్ధికి మా వంతు కృషి చేసేందుకు ముందుకు వచ్చాం. అయితే, అదే ఢిల్లీ క్రికెట్‌ మంచికోరుకుంటూ మేము ముగ్గురం ఇక కొనసాగలేం’ అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. ఓ మ్యాచ్‌కు సంబంధించి ప్రభాకర్‌ ఫిక్సింగ్‌ పాల్పడ్డాడన్న ఆరోపణలపై గౌతమ్‌ గంభీర్‌ అతడి నియమాకానికి అడ్డు చెప్పిన సంగతి తెలిసిందే.

Other News

Comments are closed.