ఢిల్లీపై జెండా ఎగరాలన్నదే ఎజెండా 

share on facebook

ఎన్నికల హీట్‌ పెరిగింది. ఓ వైపు ఎండాకాలం..మరోవైపు లోక్‌సభ ఎన్నికల కాలం ముంచుకొస్తోంది. అభ్యర్థుల ఎంపిక, ఆయారాం..గయారాంల కాలం నడుస్తోంది. ఇటువారు అటు..అటువారు ఇటు దూకుతున్నారు. పదవులే లక్ష్యంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రజల సమస్యలకన్నా పదవుల సమస్యే ముఖ్యంగా మారింది. అందుకే హీట్‌ మరింతగా పెరుగుతోంది. రాజకీయ నాయకులకు పదవులను మించిన సిద్దాంతాలు లేవు. పార్టీ సిద్దాంతాలు అన్నవి ఎప్పుడో మృగ్యం అయ్యాయి. అందుకే అందరి దృష్టి లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడమెలా అన్నదానిపైనే ఉంది. ఢిల్లీలో మన పెత్తనం ఉండాలని టిఆర్‌ఎస్‌ గట్టిగా వాదిస్తోంది. 16సీట్లు గెల్చుకుంటే ఢిల్లీని శాసించవచ్చని టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటి రామారావు తన ప్రధాన ప్రచారాంశంగా చేసుకున్నారు. బిజెపి ఒరగబెట్టిందేవిూ లేదన్న వాదన తెరపైకి తీసుకుని వచ్చారు. ఎపి సిఎం చంద్రబాబు కూడా మోడీ వ్యతిరేక వైఖరితో సాగుతున్నారు. విభజన ప్రకారం ఎపికి న్యాయంగా దక్కాల్సిన ప్రత్యేక¬దా దక్కలేదన్నదని ప్రధాన ఆరోపణ. నిజానికి ఇవన్నీ కూడా కేంద్ర,రాష్ట్ర సంబంధాల అంశాలుగా చూడాలి. కేంద్రం ఇచ్చే ప్రతిపైసా కూడా పన్నుల రూపంలో మనం కడుతున్న దనాఇకి ప్రతిఫలంగానే ఇస్తోంది. ఈ దశలో అసలు కేంద్ర రాష్ట్రాల సంబంధాలపై చర్చ సాగాలి. దీంతో పాటు ఫెడరల్‌ వ్యవస్థలో ఎవరి పరిధులు ఏమిటన్నది చర్చ జరగాల్సిన సమయం ఇది. ఎందుకంటే కేంద్రం పెత్తనం సహించబోమన్న రీతిలో గతంలో కాంగ్రెస్‌పై తిరుగబాటు బావుటా ఎగుర వేయడం ద్వారా ప్రాంతీయ పార్టీల పెత్తనం కొనసాగింది. బిజెపి సంపూర్ణ మెజార్టీతో గద్దెనెక్కినా పరిస్థితిలో మార్పు రాలేదు. అందుకే కాంగ్రెస్‌, బిజెపిలకు వ్యతిరేకంగా కూటమి కట్టాలని తెలంగాణ సిఎం కెసిఆర్‌ తీసుకున్న నిర్ణయం తో రాజకీయ పునరేకీకరణకు ప్రాణం వచ్చింది. ప్రధాని మోడీ కాంగ్రెస్‌ నేతలకన్నా దారుణంగా నిరంకు శంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాలను పెద్దగా లెక్క చేయడం లేదు. రాజకీయమే పరమావధిగా ఆయన సాగుతున్నారు. తాజాగా ఎపి, తెలంగాణ వ్యవహారాలే ఇందుకు నిదర్శనం. అందుకే ధిక్కార స్వరం వినిపిం చిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎవరూ ఊహించని రీతిలో జాతీయ రాజకీయాలపై ఒక కొత్త అస్త్రం ప్రయోగించారు. జాతీయ రాజకీయాలు నడుస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర పెత్తనాన్ని నిరసించేలా స్పష్టమైన ప్రకటన చేసారు. మోడీ ప్రభంజనం అప్రతిహతంగా సాగుతున్న వేళ కెసిఆర్‌ ఇలాంటి ప్రకటన చేస్తారని ఎవరూ అనుకోలేదు. నిజంగా మోడీ తీరువల్ల రాష్ట్రాలు అసంతృప్తిగా ఉన్నాయి.  నిధుల విషయంలో బిజెపి పాలిత రాస్ట్రాలకు, ఇతర రాష్ట్రాలకు తేడా ఉంటోంది. సాయం విషయంలో ఉదారత కాదుకదా అసలు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. కేంద్రపెత్తనమే తప్ప మరోటి కనిపించ నప్పుడు అంతకు మించిన ధైర్యం ప్రకటించాల్సిన అవసరం అన్ని రాష్ట్రాలకు ఏర్పడింది. అందుకే  జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయాల ఆలోచనా విధానం ఇప్పుడు దేశంలో చర్చకు దారితీసింది. కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రయత్నామ్నాయంగా వేదిక రావాలన్న భావన అన్ని ప్రాంతీయ పార్టీల్లో ఏర్పడింది. ఈ దశలో కేంద్రరాష్ట్ర సంబందాలపై చర్చ సాగాలి. పన్నుల చెల్లింపులు ఎలా ఉండాలి..సాయం అంటే ఏమిటి అన్న దానిపై స్పష్టత ఉండాలి. రాష్ట్రాలు చేసుకునే పనుల్లో కేంద్ర పెత్తనం ఉండరాదన్నది సిఎం కెసిఆర్‌ పదేపదే సూచిస్తున్నారు. ఆర్థఙక సంగం పర్యటన సందర్బంగా కూడా గట్టిగానే వాదించారు. కేసీఆర్‌ తనదైన శైలిలో భారత రాజకీయాలకు ఒక కొత్త ఎజెండాను తెరవిూదికి తెచ్చారు కాబట్టి దీనిని మిగితా వేదికల్లా తీసిపారేయకుండా, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలపై చర్చ చేయాలి. ఎలా ఉంటే మంచిదన్న సిద్దాంతాలను సూత్రీకరించాలి. స్పష్టమైన అజెండా ఉండాలని అన్ని రాష్ట్రాల నేతలు కోరుకుంటున్నారు. అభివృద్ది చేశామంటున్నా, నిధులు విడుదల చేశామని గొప్పలు చెబుతున్నా రాష్ట్రాల్లో అభివృద్ది అన్నది ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉంది. అభివృద్ధి అన్నదానికి కొలమానం ఏదీ లేదు కనుక పాలకుల ఎవరికి వారు తాము చేసిందే, ప్రస్తుతం చేస్తున్నదే గొప్పని చెప్పుకోవడంతో సరిపోతోంది. మోడీ కూడా అదే పద్దతిలో ఉన్నారు. కాంగ్రెస్‌, బిజెపిల హయాంలో  పాలకులు ఎవరికి వారు తామే మంచి పాలన అందించామని, ప్రజల జీవనస్థితిగతులను మార్చామని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. అయితే ప్రజలకు మాత్రం పెద్దగా మార్పు గోచరించడం లేదని తెలుస్తుంది. ఐదేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో, మల్లీ ఎన్నికలకు వెళుతున్న   మోడీ అద్బుతాలు చేశానని చెప్పుకుంటున్నారు. అయితే ఎలాంటి అద్భుతాలు చేశారన్నది ప్రజల జీవన స్థితిగతులను, సమస్యలను పట్టించుకున్న తీరును బట్టి చూస్తే తెలుస్తుంది. నోట్ల రద్దు, జిఎస్టీ వల్ల అద్భుతాలు జరిగాయని, ఇంకా జరుగుతాయని మోడీ,ఆయన బృందసభ్యులు  గొప్పగా చెప్పుకుంటున్నారు. దానివల్ల లాభనష్టాలు అనుభవిస్తున్న ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తే అది కరెక్ట్‌ అని చెప్పగలం. కాంగ్రెస్‌కన్నా తాము భిన్నమైన వారమని చెప్పుకుంటున్న కమలనాధులు అందుకు భిన్నంగా పాలన అందించివుంటే ఇవాళ ఈ చర్చ జరగాలన్న అభిప్రాయం లేదా, మోడీకి వ్యతిరేకంగా తృతీయ ప్రత్యామ్నాయం అన్న అభిప్రాయం వచ్చేది కాదు.బిజెపి పాలనా వైఫల్యాలు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య గౌరవప్రదమైన సంబంధాలు ఉండాలంటే విప్లవించక తప్పదు. వాటిని చర్చించకా తప్పదు.

Other News

Comments are closed.